పోలింగ్ పంచ్.. పవన్ కు రెండు చోట్లా కష్టమా!

Update: 2019-04-08 05:38 GMT
గాజువాకలో ఆరవై వేల మంది కాపుల ఓట్లున్నాయి.. భీమవరంలోనూ అదే స్థాయిలో కాపు ఓట్లున్నాయి… ఈ రెండు సమీకరణాలకు మించి - జనసేన అధిపతి ఆ రెండు నియోజకవర్గాల్లోనూ నామినేషన్ వేయడానికి మరో రీజన్ భూతద్దం పట్టి వెదికినా కనిపించదు!

కేవలం అనుకూల కులసమీకరణాలు ఉన్నాయి కాబట్టే పవన్ ఆ రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ చేశారనే అంశం సుస్పష్టం అవుతోంది. మొదటి నుంచి ఇదే మాటే వినిపిస్తూ ఉంది. మరి ఒక పార్టీ అధినేత - తనకు కులం లేదని చెప్పుకున్న పవన్ కల్యాణ్.. తనకు లేదంటున్న కులం ఓట్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు రెండింటిని చూసి నామినేషన్ దాఖలు చేయడం సహజంగానే విమర్శలకు తావిచ్చింది.

పవన్ కల్యాణ్ కేవలం క్యాస్ట్ మీద ఆధారపడి రాజకీయాలను చేస్తున్నాడనే అభిప్రాయాన్ని కలిగించింది. అలా కాదు అని ఎవరైనా వాదించినా దానికి విలువ ఉండదు. పవన్ కేవల కులం మీద ఆధారపడి మాత్రమే ఎన్నికల్లో పోటీకి దిగారు అనే అంశం తేలిపోయింది.

అయితే రాజకీయాల్లో కులానికి ప్రాధాన్యత ఉంది కానీ, అంతకు మించి స్థానికత అనే అంశానికి కూడా విలువ ఉంది.ఆ రెండునియోజకవర్గాల్లోనూ ఒక్కోచోట డెబ్బై వేల  మంది కాపులున్నారని అనుకున్నా, వాటిలో పోల్ అయ్యే ఓట్లు ఎన్ని? వాళ్లలో కులాభిమానంతో పవన్ కు ఓటేసే వాళ్లు ఎంత మంది అనేది వేరే లెక్క.

ఇలా ఒక కులం వాళ్లు ఏకం అయ్యారనే భావన కనిపిస్తే.. మిగతా కులాలు సహకరిస్తాయా? అనే అంశమూ ఆలోచించదగిన అంశమే. అంతకు మించిన మరో విషయం ఏమిటంటే..ఈ రోజుల్లో ఎమ్మెల్యేలు తమకు అందుబాటులో ఉండాలి అనేది జనాల లెక్కగా మారింది. అందరూ కాకపోయినా.. తమ సమస్యలను రాజకీయ నేతలకు విన్నవించుకోవాలని అనుకునే వాళ్లు.. ఎమ్మెల్యే తమకు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు.

పవన్ గెలిచినా ఆయనతో ఎవరికీ యాక్సెసబులిటీ ఉండదు అనేది నిష్టూరమైన సత్యం. ఆ విషయం స్థానికులకు తెలియనది కాదు.  ఈ విషయాన్నే ఇతర పార్టీల అభ్యర్థులు అస్త్రంగా చేసుకుంటున్నారు. ఇక మరోవైపు.. గాజువాకలో పవన్ కల్యాణ్ ఇంటికి అద్దెను తీసుకున్నారు. అయితే అదంతా ఎన్నికల స్టంటు అని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. గెలిస్తే పవన్ అందుబాటులో ఉండడు అనే ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. హిందూపురం వంటి ఉదాహరణలు ఈ విషయంలో ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి. హిందూపురానికి బాలకృష్ణది గెస్ట్ అప్పీరియన్సే కదా! పవన్ కూడా ఆ సినీ తానులోని ముక్కే కదా!

ఇక భీమవరంలో పవన్ చేజేతులారా ఓటమిని తెచ్చుకుంటున్నాడనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. పవన్ రెండు  చోట్ల పోటీ చేశాడు. గెలిస్తే ఒక చోట రాజీనామా తప్పదు. ఆయన భీమవరానికి రాజీనామా చేస్తాడనే ప్రచారం ముందు నుంచి ఉంది. ఇక అద్దె ఇల్లు కూడా పవన్ కల్యాణ్.. భీమవరంలో తీసుకోలేదు! గాజువాకల భీమవరానికి ప్రత్యేక మెనిఫెస్టో అని హడావుడి చేయలేదు!

పవన్ ను గెలిపిస్తే భీమవరానికి ఉప ఎన్నిక తప్పదు అని ప్రత్యర్థులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక అన్నింటికి మించి.. ఎలక్షనీరింగ్ ఏ అభ్యర్థి విజయంలో అయినా కీలకం. ఆఖరి నిమిషంలో అక్కడే కూర్చుని కష్టపడుకున్న వారే గెలుస్తారు. తను నామినేషన్ వేశాను కాబట్టి.. గెలుపు ఖాయం..అనే రోజులు ఎవరికైనా పోయాయి. ఇలాంటి నేపథ్యంలో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కల్యాణ్.. ఎక్కడ పోల్ మేనేజ్ మెంట్ మీద కాన్సన్ ట్రేట్ చేయగలడు? ఎక్కడ నెగ్గగలడు అనేవి ప్రస్తుతానికి ప్రశ్నార్థకాలే!



Tags:    

Similar News