మూర్తి విమర్శలు పట్టించుకోవద్దు: పవన్

Update: 2018-09-17 07:22 GMT
కాపు సామాజిక వర్గ బడా పారిశ్రామిక వేత్తల నుంచి జనసేన పార్టీ  డబ్బులు వసూలు చేస్తోందని తన స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టి సంచలనం సృష్టించాడు జర్నలిస్ట్ మూర్తి.. ఇది రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. ఏకంగా చానెల్ యాజమాన్యమే మూర్తి ప్రసారం చేసిన కథనాలు - వీడియోలను ఆపించేసింది. దీనికి మనస్తాపం చెందిన మూర్తి చానెల్ కు రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు. వచ్చాక పలు పదునైన ప్రశ్నలతో జనసేనాని పవన్ కు ప్రశ్నలు సంధించారు.

తాజాగా మూర్తి చేసిన స్ట్రింగ్ ఆపరేషన్.. అనంతరం విమర్శలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశంలో స్పందించినట్టు తెలిసింది. పవన్ మాట్లాడుతూ.. ‘ఈ విషయాన్ని తేలికగా తీసుకోండి. మన పార్టీ నాయకులు కూడా దీనిపై స్పందించవద్దని చెప్పండి.  ఈ విషయంలో ఆవేశంగా మాట్లాడి దీన్ని మరింత వివాదాస్పదం చేయవద్దు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిస్తే ప్రజలు మనల్ని - మన నిజాయితీని అర్థం చేసుకుంటారు’ అని పేర్కొన్నట్టు సమాచారం.

తాజాగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి విజయ్ బాబు మాట్లాడుతూ పార్టీ అన్నాక తిట్లు - పొగడ్తలు సహజమని.. దీన్ని భరిస్తామని సెలవిచ్చారు. స్టింగ్ ఆపరేషన్ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఈ విషయంలో జనసేన పార్టీ అధికారికంగా స్పందిందని తేల్చిచెప్పారు. మహా టీవీ నుంచి వైదొలిగిన జర్నలిస్టు మూర్తి చేసిన విమర్శలకు స్పందిస్తే.. ఆయన్ను అనవసరంగా హీరోను చేసినట్టు అవుతుందని ఆయన తెలిపారు. మూర్తి జనసేన పార్టీని టార్గెట్ చేసి మరింత పాపులారిటీ సంపాదించేందుకు రెడీ అయ్యాడని..  అందుకే ఆయన్ను పట్టించుకోం అని స్పష్టం చేశారు. తామేమీ అక్రమంగా డబ్బులు తీసుకోలేదని.. అన్ని పార్టీల లాగానే విరాళాలు సేకరించామని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వారిలా కాంట్రాక్టుల నుంచి కమీషన్లు - ప్రాజెక్టుల్లో వాటాలు - మైనింగ్ లో డబ్బులు తీసుకోలేదని తెలిపారు. స్వచ్ఛందంగా జనసేనకు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ప్రజల నుంచే తీసుకున్నామని వివరణ ఇచ్చారు.
Tags:    

Similar News