జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఏపీకోసం తాను ప్రాణత్యాగానికి అయినా సిద్ధమని ప్రకటించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్న రోజు నుంచి ఎప్పుడైనా తాను ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమని పవన్ కల్యాణ్ చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరూ బలిదానాలు చేయొద్దు... అవసరమైతే పవన్ కల్యాణే బలిదానం చేస్తాడని సంచలనంగా ప్రకటన చేశారు. ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగిస్తూ యువ నాయకత్వం కావాలని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే యువతను పోరాటాలకు రోడ్లపైకి రమ్మని పిలవను అని చెప్పారు.
ఏపీ ప్రయోజనాల కోసం తాను దీక్షకు సైతం సిద్ధమని పవన్ ప్రకటించారు. `అవసరమైతే…అవసరమైతే ఏమిటి అవసరం పడుతుంది…నేను ఆమరణ దీక్ష చేస్తా` అని పవన్ కల్యాణ్ అన్నారు. `ప్రత్యేక హోదాపై కేంద్రం ఏదో ఒక నిర్ణయం చెప్పి తీరాలి. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలన్నీ అమలు చేసి తీరాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తాను బలిదానానికి సిద్ధం` అని పవన్ పునరుద్ఘాటించారు. భారత్ మాతాకి జై నినాదంతో తన ప్రసంగాన్ని పవన్ కల్యాణ్ ముగించారు.
కాగా, జనసేన సభ్యత్వం గురించి ప్రకటన చేశారు. `జనసేన సభ్యత్వం తీసుకోవాలంటే 9394022222 కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. మీకు జనసేనలో సభ్యులవుతారు. `ఓటు బ్యాంక్ అంటే నాకు నచ్చదు. మీరంతా నా కుటుంబం. కుటుంబం అంటే సంపద కాదు. రాజకీయం నేను కోరుకున్నది కాదు. జరిగిందంతే. ప్రజలను ఓట్ బ్యాంక్ అనడం తనకు ఇష్టం ఉండదు. జీవం ఉన్న మనుషులు బంగారంలా చూడాలి` అని పవన్ చెప్పారు.