ప‌వ‌న్‌కు త‌న స‌త్తా అర్థ‌మైన‌ట్టేనా?

Update: 2018-07-05 09:41 GMT
2019లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికే  దాదాపుగా అన్ని పార్టీలు త‌మ‌దైన శైలి వ్యూహాలు రచించుకున్నాయ‌ని చెప్పాలి. ఇత‌ర రాష్ట్రాల్లో ప‌రిస్థితి ఎలా ఉన్నా... ఏపీలో మాత్రం ఎన్నిక‌ల వేడి బాగానే రాజుకుంద‌ని చెప్పాలి.  ఎందుకంటే... మిగిలిన రాష్ట్రాల‌తో పోలిస్తే ఏపీలో బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం ఉంది. విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన సుదీర్ఘ పాద‌యాత్ర ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు భారీ ఎత్తున జ‌నాద‌ర‌ణ ల‌భిస్తోంది. తూర్పుగోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న యాత్ర‌కు జ‌నం నీరాజ‌నాలు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీకి నానాటికీ పెరుగుతున్న ప్ర‌జాద‌ర‌ణ‌ను చూసిన  అధికార టీడీపీ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వ్యూహాల‌ను మార్చుకుంటున్న వైఖ‌రి చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అంతేకాకుండా గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో  ఏపీలో టీడీపీ అధికారంలోకి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా నిలిచిన టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ - జ‌నేస‌న అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈ ద‌ఫా ఆ పార్టీకి పొత్తు ఇచ్చేది లేద‌ని తేల్చేశారు. అంతేకాకుండా ఈసారి 175 స్థానాల్లో జ‌న‌సేన అభ్య‌ర్థులు పోటీ చేస్తార‌ని కూడా ఆయ‌న ఇప్ప‌టికే చాలా విస్ప‌ష్టంగా ప్ర‌క‌టించేశారు కూడా.

ఇక మొన్న‌టిదాకా టీడీపీకి మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగిన బీజేపీ... ఈ ద‌ఫా తాను కూడా ఒంట‌రి పోరుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో సున్నా సీట్లు సాధించినా...  ఈ సారైనా ఓ మోస్త‌రు ప్ర‌భావం చూపుతామంటూ రంగంలోకి దిగిపోయారు. మొత్తంగా ఏపీలో ఎన్నిక‌ల వేడి ఇప్ప‌టికే బాగానే రాజుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో  అధికారం త‌మ‌కే ద‌క్కుతుంద‌ని టీడీపీ చెబుతున్నా... అందుకు త‌గ్గ ప‌రిస్థితులు లేవ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ సారి ఏది ఏమైనా  జ‌గ‌న్ సీఎం కావ‌డం ఖాయ‌మ‌న్న మాట రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో ఒక్క‌సారి అధికారం ఇస్తే...  మేమేంటో చూపెడ‌తామ‌ని ఇటీవ‌లే ప‌వ‌న్ కూడా సీఎం కుర్చీపై త‌న‌కున్న ఆశ‌ను బ‌య‌ట‌పెట్టుకున్నారు. పార్టీ సంస్థాగ‌త నిర్మాణ‌మే పూర్తి చేయ‌ని ప‌వ‌న్‌... ఏకంగా సీఎం కుర్చీని గురి పెట్టి మాట్లాడుతున్న వైనం ఇప్పుడు నిజంగానే ఆస‌క్తి రేకెత్తిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. రెండు నెల‌ల క్రిత‌మే యాత్ర ప్రారంభించిన ప‌వ‌న్‌... ఇప్ప‌టిదాకా ఉత్త‌రాంధ్ర‌లోని క‌నీసం నాలుగు జిల్లాల్లో కూడా పర్య‌ట‌న‌ను పూర్తి చేయ‌లేక‌పోయారు. శ్రీ‌కాకుళం - విజ‌య‌న‌గ‌రం జిల్లాల ప‌ర్య‌ట‌న ఎలాగోలా పూర్తి అయింద‌నిపించిన ప‌వ‌న్‌... ప్ర‌స్తుతం విశాఖ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ జిల్లాలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న ఇంకెన్ని రోజులు సాగుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. విశాఖ జిల్లా ప‌ర్య‌ట‌న‌ను పూర్తి చేసుకుని తూర్పు గోదావ‌రి జిల్లాకు వ‌స్తారో - లేదంటే మ‌ళ్లీ  రెస్ట్ అంటూ హైద‌రాబాదు వెళ‌తారో చూడాలి.

మొత్తంగా యాత్ర పేరిట ప‌వ‌న్ హ‌డావిడి చేస్తున్నా... ఆ యాత్ర ఏమంత పెద్ద‌గా ప్ర‌భావం చూపుతున్న దాఖ‌లా క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో నిన్న‌టిదాకా త‌న‌ను తాను సీఎంగా అభివ‌ర్ణించేసుకుని - తానేం చేస్తానో చెబుతూ  వ‌చ్చిన ప‌వ‌న్ నిన్న రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఆ  ట్వీట్ సారాంశం చూస్తే... ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో తానేమీ పెద్ద‌గా ప్ర‌భావం చూపే అవ‌కాశాలు లేవ‌ని  ఆయ‌నే స్వ‌యంగా చెప్పిన‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ - వారికి తొలుత వ‌చ్చిన ఓట్ల శాతాల‌ను ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌... త‌న‌కు కూడా తొలిసారి వారికి వ‌చ్చిన‌న్ని ఓట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని చెప్పారు. అయితే ప‌ది శాతం ఓట్ల‌తో ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేయ‌డం సాధ్యం కాదు క‌దా. అందుకే అధికారం చేజిక్కించుకునేందుకు అవ‌స‌ర‌మైన ఓట్ల శాతాన్ని సాధించ‌డంలో జ‌న సైనికులు ముందుకు సాగాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

ప‌వ‌న్  త‌న ట్వీట్ లో ఏఏ అంశాల‌ను ప్ర‌స్తావించార‌న్న మాట‌కొస్తే... *ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 10 శాతం ఓట్ల శాతంతోనే మొద‌లుపెట్టారు. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా 10 శాతం ఓట్ల‌తోనే మొద‌లుపెట్టారు. ఈ విష‌యాన్ని జ‌న సైనికులు గ‌మ‌నించాలి.  మోదీ - ట్రంప్ మాదిరే జ‌న‌సేన కూడా 10 శాతం ఓట్ల శాతంతోనే మొద‌లుపెట్టింది. ఇదేదో మ‌నం చెప్పిన విష‌యం కాదు. అధికార పార్టీ చేయించుకున్న స‌ర్వే చెప్పిన విష‌యం.  ఈ లెక్కన మ‌న తొలి అడుగు ఘ‌నమే.  ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు  చేయడానికి అవ‌స‌ర‌మైన ఓట్ల శాతాన్ని సంపాదించేందుకు జ‌న‌స‌సైనికులు సిద్ధం కావాలి* అని ప‌వ‌న్  స‌ద‌రు ట్వీట్  లో త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. అంటే... ప‌వ‌న్ త‌న వాస్త‌వ  బ‌లాన్ని తెలుసుకున్న మీద‌టే ఈ ట్వీట్ చేశార‌న్న విశ్లేష‌ణ వినిపిస్తోంది. ఈ  ట్వీట్ చేయ‌డం ద్వారా 2019 ఎన్నికల్లో త‌మ‌కు అధికారం అంద‌ద‌ని ప‌వ‌నే స్వ‌యంగా తేల్చేశార‌న్న ప్ర‌చారం సాగుతోంది. అంటే ప‌వ‌న్ టార్గెట్ 2019 కాద‌న్న మాట‌. 2014లో ప‌రిస్థితులు ఎలా ఉంటాయో? అప్ప‌టిదాకా ప‌వ‌న్ రాజకీయాల్లో ఉంటారో?  లేదో?   చూడాలి. ఒక‌వేళ ఉన్నా... అప్ప‌టి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా జ‌న‌సేన ప్ర‌జాభిమానాన్ని అందుకుంటుందో, లేదో చూడాలి.
Tags:    

Similar News