పీకే రూటే సపరేటు.. అందరివీ చప్పట్లు, ఈయనది గంట

Update: 2020-03-22 14:07 GMT
సినిమాల్లో పవర్ స్టార్, రాజకీయాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ నిజంగా ఏది చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. సినిమాల్లో తనదైన స్టైల్ తో లక్షలాది మంది అభిమాన ధనాన్ని సంపాదించుకున్న పవన్... రాజకీయాల్లోనూ తనదైన ప్రత్యేకతనే చాటుకునేందుకే యత్నించారు తప్పించి... అందరూ నడిచిన దారిలో మాత్రం నడవలేదు. ఈ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలినా కూడా పవన్ వెనుకాడలేదనే చెప్పాలి. అయినా ఇప్పుడు ఈ సోది అంతా ఎందుకనుకుంటున్నారా? ఏ విషయంలో అయినా పవన్ రూటు సపరేటే. అందుకు నిదర్శనంగా నిలుస్తున్న ఘటన ఆదివారం జరిగింది కాబట్టే ఈ ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చింది.

కరోనా వైరస్ విస్తరణను కట్టి చేసే క్రమంలో ఆదివారం జనతా కర్ఫ్యూ పాటిద్దామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు దేశం మొత్తం మద్దతుగా నిలిచింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంటి నుంచి బయటకు రాకుండా అంతా స్వీయ నిర్బంధాన్నే పాటించారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని మోదీ పిలుపు ఇవ్వగా... ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశం మొత్త చప్పట్లతో మారుమోగింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన దాదాపుగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు చప్పట్లు చరిచి మోదీ పిలుపునకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

జనమంతా చప్పట్లతో జనతా కర్ఫ్యూ కు మద్దతు పలికితే... పవన్ మాత్రం చప్పట్లకు బదులుగా గంట కొట్టి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారనే చెప్పాలి. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా అసలు బటయకే రాని పవన్... సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి తన నివాసం బయటకు వచ్చారు. అప్పటికే తన ఇంటి ఆవరణలోనే ఏర్పాటు చేయించుకున్న గంటను కొడుతూ పవన్ ఫొటోలకు ఫోజులిచ్చారు. అయినా మోదీ చప్పట్లు కొట్టమన్న ప్రకటనకు మద్దతు పలికిన పవన్ గంట ఎందుకు కొట్టారంటారా? ఏమో మరి... తానొక్కడి చప్పట్లు అందరికీ వినబడవని భావించిన ఆయన గంట కొట్టారేమో. ఏదేమైనా అందరూ చప్పట్లు చరిస్తే... పవన్ మాత్రం గంట కొట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
Tags:    

Similar News