చంద్ర‌బాబు చింత‌కాయ‌.. ప‌వ‌న్‌ మ‌రో శాపం!

Update: 2018-11-06 05:33 GMT
ఏమైందో కానీ జ‌న‌సేన అధినేత ఇప్పుడు వైరైటీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొంత‌కాలం ఆవేశంగా.. మ‌రికొంత కాలం ఆలోచ‌న‌ల్ని రేకెత్తించేలా ప్ర‌సంగాలు చేసిన ఆయ‌న తాజాగా.. త‌న‌కు కోపం ఉన్నోళ్ల మీద అదే ప‌నిగా శాపాల మీద శాపాలు పెట్టేస్తున్న తీరు అంత‌కంత‌కూ పెరుగుతోంది. మొన్న‌టికి మొన్న యూపీ నాలుగు ముక్క‌లు కావాల‌ని.. ఆ రాష్ట్రాన్ని చూసుకొని క‌మ‌ల‌నాథులు చెల‌రేగిపోతున్నార‌ని.. ఆ రాష్ట్రం ముక్క‌లైపోతే వారి గ‌ర్వం అణిగిపోతుందంటూ శాపం పెట్టేశారు.

ఇటీవ‌ల కాలంలో త‌న‌కు న‌చ్చ‌ని వారికి శాపాలు ఇచ్చే అల‌వాటును చేసుకున్నారేమో కానీ.. తాజాగా ప‌వ‌న్ మ‌రోసారి ఇదే త‌ర‌హాలో బాబుకు శాపం పెట్టేశారు. తూర్పుగోదావ‌రి జిల్లా పెద్దాపురంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన ఆయ‌న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న కుమారుడు లోకేశ్‌.. ప‌లువురు మంత్రుల‌కు ఘాటు శాపాన్ని ఇచ్చేశారు.

పాపం పండితే ఎవ‌రైనా చింత‌కాయ‌లా రాలిపోతార‌ని.. బాబు కూడా చింత‌కాయ‌లా రాలిపోయే టైం వ‌స్తుంద‌న్నారు. అక్క‌డితో ఆగ‌ని ప‌వ‌న్‌.. త‌న చింత‌కాయ శాపం వెనుక ఉన్న క‌థ‌ను చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో వెంక‌య్య‌స్వామి అనే అవ‌ధూత ఉండేవార‌ని.. పాపాలు చేసేటోళ్లు చింత‌కాయ‌ల్లా రాలిపోతార‌ని చెప్పేవార‌ని.. అదే రీతిలో టీడీపీ నేత‌ల పాపాలు పండుతాయ‌న్నారు. త్వ‌ర‌లోనే వారు చింత‌కాయ‌ల్లా రాలిపోతార‌ని.. దీపావ‌ళి ట‌పాసుల్లా పేలిపోతార‌న్నారు.

త‌న‌పై విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధిస్తూ ట్వీట్ చేసిన లోకేశ్ పైనా ప‌వ‌న్ మండిప‌డ్డారు. త‌మ పాల‌న‌లో అవినీతి లేద‌న్న లోకేశ్ వ్యాఖ్య‌ల‌కు దిమ్మ తిరిగేలా బ‌దులిచ్చిన ప‌వ‌న్‌.. ఒక‌సారి పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని నూరపాలెంకు వ‌చ్చి చూడాల‌న్నారు.

లోకేశ్ తాత ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎస్సీల‌కు ఇచ్చిన 470 ఎక‌రాల్ని ఎలా దోచుకున్నారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా  క‌నిపిస్తుంద‌ని.. ఆ భూమిలో మ‌ట్టిని తవ్వేసి రూ.2వేల కోట్లు కొల్ల‌గొట్టిన‌ట్లుగా ఆరోపించారు. హోంమంత్రి చిన‌రాజ‌ప్ప‌.. మ‌రో మంత్రి య‌న‌మ‌ల అవినీతి క‌నిపించ‌టం లేదా? అంటూ ప్ర‌శ్నించారు. బాల‌య్య బూతులు తిడితే ప‌ట్టించుకోరు కానీ తాను మాత్రం ఒక మాట అన్నంత‌నే చ‌ర్చా కార్య‌క్ర‌మాలు పెడ‌తార‌న్నారు.

టీడీపీ నేత‌ల అవినీతి భాగోతాల‌ను త‌న‌దైన శైలిలో చెప్పిన ప‌వ‌న్‌.. వంతాడ రిజ‌ర్వ్ ఫారెస్ట్ లో రూ.3వేల కోట్ల ఖ‌నిజాన్ని ఆక్ర‌మంగా త‌వ్వేస్తుంటే మంత్రులు చిన‌రాజ‌ప్ప‌.. య‌న‌మ‌ల ఏం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. తిత‌లీ తుపాను బాధితుల‌కు ప‌రిహారంగా ఇచ్చే చెక్కుల మీద చంద్ర‌బాబు ఫోటోలు అచ్చేయ‌టంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ త‌ర‌హా నీచ రాజ‌కీయాలు స‌రికావ‌న్న ఆయ‌న‌.. బాబేమీ మ‌హాత్మ‌గాంధీ కాద‌ని.. బాధితుల‌కు ఇచ్చేది హెరిటేజ్ డ‌బ్బులు అంతకంటే కాద‌ని ప‌వ‌ర్ ఫుల్ పంచ్ ఇచ్చారు. మ‌రి.. ప‌వ‌న్ శాపాల‌పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

   

Tags:    

Similar News