రీ ఎంబ‌ర్స్ మెంట్ కాదు.. మొత్తానికే ఎత్తేస్తానంటున్న ప‌వ‌న్

Update: 2019-03-04 06:57 GMT
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్ హ‌యాంలో ప్ర‌వేశ‌పెట్టిన ఫీజు రీ ఎంబ‌ర్స్ మెంట్ ప‌థ‌కం చాలా మంది పేద విద్యార్థుల‌కు మేలు చేసింది. వారిని ఉన్న‌త విద్య‌కు చేరువ చేసింది. ప్ర‌జ‌ల్లో ఈ ప‌థ‌కానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. అందుకే విభ‌జ‌న త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ రెండు తెలుగు రాష్ట్రాలూ దాన్ని కొన‌సాగిస్తున్నాయి. అయితే - ఈ ప‌థ‌కంపై ప‌లు విమ‌ర్శ‌లూ లేక‌పోలేదు. ఫీజు భారం తెలియ‌క‌పోవ‌డంతో చాలామంది విద్యార్థులు విద్య‌ను నిర్ల‌క్ష్యం చేశార‌ని ఆరోప‌ణ‌లున్నాయి.

తాజాగా రాయ‌ల‌సీమ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫీజు రీ ఎంబ‌ర్స్ మెంట్ గురించి సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు. రీ ఎంబ‌ర్స్ మెంట్ ప్ర‌క్రియ ఎందుక‌ని ప్ర‌శ్నించారు. అస‌లు విద్యార్థుల నుంచి రుసుములు వ‌సూలు చేయ‌కుండా ఉంటే స‌రిపోతుంది క‌దా అని సూచించారు. ముందు బ‌ల‌వంతంగా వ‌సూలు చేసి ఆపై చాన్నాళ్ల‌కు తిరిగి ఇవ్వడాన్ని త‌ప్పుప‌ట్టారు. జ‌న‌సేన అధికారంలోకి వ‌స్తే విద్య‌ను ఉచితంగా అందిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

విద్యావ్యవస్థలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ పరిచయం చేయాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. ఆల్జీబ్రా, కాలిక్యులస్, సైన్స్ లోనూ కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ వర్తింప చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఫ‌లితంగా థియరీ ఆఫ్ రిలేటివిటీ కూడా పిల్ల‌ల‌కు సులభంగానే అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లల్ని కార్పొరేట్ పాఠ‌శాల‌ల్లో చదివిస్తున్న సంగ‌తిని ప‌వ‌న్ గుర్తుచేశారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువులు ఎలా ఉన్నాయో చెప్పేందుకు అదే నిద‌ర్శ‌న‌మ‌ని తెలిపారు.

ప‌వ‌న్ ఉన్న‌త విద్యావంతుడు కాద‌ని, ఆయ‌న చెప్తే ఎందుకు వినాల‌ని ఇటీవ‌ల ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ విమ‌ర్శ‌ల‌పై ప‌వ‌న్ తాజాగా స్పందించారు. కాన్సెప్ట్స్ భోధించకుండా బట్టీ పట్టించే చ‌దువులు త‌న‌కు న‌ప్ప‌లేద‌న్నారు. అందుకే ఇంట‌ర్మీడియ‌ట్ తో చ‌దువుకు ఫుల్ స్టాప్ పెట్టేశాన‌ని తెలిపారు. అయితే - చాలా పుస్త‌కాలు చ‌ద‌వ‌డం ద్వారా తాను జ్ఞానాన్ని స‌ముపార్జించుకున్నాన‌ని చెప్పారు. థామ‌స్ ఆల్వా ఎడిస‌న్‌, ఐన్ స్టీన్ వంటి గొప్ప గొప్ప‌వారు సంప్ర‌దాయ విద్య‌ను అనుస‌రించ‌లేద‌ని ప‌వ‌న్ గుర్తుచేశారు. కోట్లాది మంది  జీవితాల‌న ప్ర‌భావితం చేసే పాల‌సీల‌ను రాజ‌కీయాల్లో రూపుదిద్దాల్సి ఉంటుంద‌ని.. అందుకే ద‌శాబ్ద కాలంగా తాను అనేక విష‌యాల‌ను చిత్త‌శుద్ధితో నేర్చుకున్నాన‌ని, బాగా అనుభ‌వం గ‌డించాన‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News