బ‌ద్వేల్‌పై ప‌వ‌న్ నిర్ణ‌య‌మేంటి? ఏం చేస్తారు?

Update: 2021-09-29 11:30 GMT
ఏపీలోని సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌పలో ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌.. బ‌ద్వేల్‌కు వ‌చ్చే అక్టోబ‌రు 30న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డ నుంచి 2019లో విజ‌యం ద‌క్కించుకున్న‌ వైసీపీనాయ‌కుడు.. డాక్టర్ వెంక‌ట సుబ్బ‌య్య‌.. హ‌ఠాన్మ‌రణం చెంద‌డంతో.. ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ ఉప ఎన్నిక‌కు సంబం ధించి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది. దీంతో అధికార, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు.. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేశాయి. వైసీపీ త‌రఫున వెంక‌ట సుబ్బ‌య్య‌స‌తీమ‌ణి.. సుధ‌ను పోటీ పెడుతున్నారు. ఇక‌, టీడీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌లో పోటీ చేసి ఓడిపోయిన ఓబులాపురం రాజ‌శేఖ‌ర్‌కే మ‌రోసారి ఛాన్స్ ఇచ్చారు.

అయితే.. ఇప్పుడు కీల‌క‌మైన జ‌న‌సేన ఇక్క‌డ నుంచి పోటీ చేస్తుందా?  లేదా? అనేది ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ టికెట్‌పై క్లారిటీ రాలేదు. టీడీపీని తీసుకుంటే.. గ‌త రెండు నెల‌ల నుంచే అభ్య‌ర్థిని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం చేసుకుంది. దీంతో రాజ‌శేఖర్ కూడా ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. మ‌రి ఏపీలో పాల‌న భ్ర‌ష్టు ప‌ట్టింద‌ని.. అవినీతి జ‌రుగుతోంద‌ని.. మార్పు రావాల‌ని.. గ‌ళం వినిపిస్తున్న ప‌వ‌న్‌.. ఇక్క‌డ నుంచి పోటీ ప‌డ‌తారా? అనేది ఆస‌క్తిగా మారింది. బ‌ద్వేల్ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో.. ఇక్క‌డ నుంచి ఎస్సీ అభ్య‌ర్థిని నిల‌బెట్టాల్సి ఉంది. దీనికి సంబంధించి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మిత్ర పార్టీ.. బీజేపీ ఒక ప్ర‌క‌ట‌న చేసింది.

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తమ‌కు గెలుపు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. మా నాయ‌కులు ఎక్కువ‌గా కూడా ఇక్క‌డే ఉన్నార‌ని పేర్కొంటూ.. ఆదినారాయ‌ణ‌రెడ్డి, సీఎం ర‌మేష్‌.. వంటి వారిపేర్ల‌ను కూడా బీజేపీ నాయ‌కులు చెప్పుకొచ్చారు. మ‌రి ఇప్పుడు బీజేపీతో మిత్ర‌త్వం నేప‌థ్యంలో ప‌వ‌న్ ఈ ద‌ఫా కూడా బ‌ద్వేల్ టికెట్‌ను బీజేపీకే వ‌దిలేస్తారా? అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే.. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక లోనూ ఆయ‌న ఆది నుంచి ప‌ట్టుబ‌ట్టి.. చివ‌రి నిముషంలో బీజేపీకి వ‌దిలేశారు. అదికూడా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గ‌మే. ఇక‌, ఇప్పుడు.. బ‌ద్వేల్‌లో ఏం చేస్తారో.. చూడాలి.

అదేస‌మ‌మయంలో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి అన్యాయం జ‌రుగుతోంద‌ని... ప‌వ‌న్  త‌ర‌చుగా చెబుతున్నా రు. ఇటీవ‌ల రెండు రోజులుగా చేస్తున్న ట్వీట్ల యుద్ధంలోనూ ఆయ‌న ఎస్సీ వ‌ర్గాల‌పై జ‌రిగిన దాడుల‌ను ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలో ఎస్సీల ఓటు బ్యాంకు ఆయ‌న‌కు అనుకూలంగా మారుతుంద‌నే అంచనాలు ఉన్నాయి. ఇదే వాస్త‌వమ‌ని నిరూపించేందుకు ప‌వ‌న్‌కు వ‌చ్చిన అద్భుత అవ‌కాశం.. బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌. అంతేకాదు.. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పుంజుకున్నామ‌ని.. ప‌వ‌న్ చెబుతున్నారు. మున్ముందు మ‌రింత పుంజుకుంటామ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న వ్యూహాన్ని ప‌రిశీలించుకునేందుకు ఎస్సీల్లో.. ఉన్న ఓటు బ్యాంకును ప‌రిశీలించుకునేందుకు ఇదో చ‌క్క‌ని అవ‌కాశ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News