నాది - కేసీఆర్‌ ది ఒక‌టే భావ‌న‌: ప‌వ‌న్‌

Update: 2018-03-04 11:36 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌కు ఊహించని మ‌ద్ద‌తు ద‌క్కింది. ఇటు దేశ‌రాజ‌కీయాల మార్పుకోసం - అటు ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం కేసీఆర్ గ‌ళం విప్పిన నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌ - సినీ న‌టుడు పవన్ కళ్యాణ్ మ‌ద్ద‌తు ఇచ్చారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు కృతజ్ఞతలు చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తే ఇవ్వండి లేకపోతే ఇవ్వలేమని తెగేసి చెప్పాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని .. ప్రత్యేక హోదా కోసం ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరికీ ఇవి కొండంత నైతిక బలం ఇచ్చిందని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. స్పెషల్ స్టేటస్ కు మద్దతిచ్చిన కేసీఆర్ కు ఏపీ ప్రజల తరుఫున ధన్యవాదాలు చెప్తున్న‌ట్లు ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.

తెలుగు ప్రజలపై కేసీఆర్‌ కు ఉన్న ప్రేమ - అభిమానం ప్రస్ఫుటంగా కనబడింద‌ని ప‌వ‌న్ కితాబు ఇచ్చారు. తెలుగు వారు ఎక్కడున్నా... ఒకటే అనడానికి ఈ వ్యాఖ్యలు ఒక ఉదాహరణ అని ప‌వ‌న్ విశ్లేషించారు. వాళ్లు రైల్వే జోన్‌ గురించి మాట్లాడితే తాము బయ్యారం ఉక్కు కర్మాగారానికి మద్దతిస్తామని చెప్పారు. థర్డ్ ఫ్రoట్ పై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోందని - కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాలి అంటే థర్డ్ ఫ్రoట్ ఉండాలని ప‌వ‌న్ ఆకాంక్షించారు. థర్డ్ ఫ్రoట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన కేసీఆర్ ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాన‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. నాది, కేసీఆర్ ది ఒకటే అభిప్రాయం అని ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.

జాతీయ పార్టీలు న్యాయం చేస్తే ప్రాంతీయ పార్టీలు పుట్టవని పవన్ కల్యాణ్ వివ‌రించారు. రక్తం చిందించకుండా రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌ దేన‌ని పవన్ కల్యాణ్ ప్ర‌క‌టించారు. జాతీయ పార్టీలు - ప్రాంతీయ పార్టీలను పట్టించుకోకపోతే.. థర్డ్ ఫ్రoట్ పుడుతుందని ప‌వ‌న్ వివ‌రించారు. థర్డ్ ఫ్రoట్‌ కు కేసీఆర్ లాంటి వ్యక్తి నాయకత్వం ఎంతైనా అవసరమ‌ని ప్ర‌క‌టించారు. థర్డ్ ఫ్రoట్‌ కు కేసీఆర్ అంకురార్పణ చేస్తే తాను మద్దతిస్తాన‌ని పవ‌న్ ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News