అబ్బా!... పీకే ఓట‌మి ఒప్పేసుకున్నాడ‌బ్బా!

Update: 2019-03-06 04:06 GMT
టాలీవుడ్ లో మెగాస్టార్ సోద‌రుడిగా ఎంట్రీ ఇచ్చి ప‌వ‌ర్ స్టార్‌ గా ఎదిగిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌... రాజ‌కీయాల్లో కూడా త‌న సోద‌రుడికి ఏమాత్రం తీసిపోని రీతిన ముందుకు సాగుతున్నారు. ఐదేళ్ల నాడే పొలిటిక‌ల్ పార్టీని ప్రారంభించిన ప‌వ‌న్‌... ఎన్నిక‌ల బ‌రికి స‌మాయ‌త్తం అయ్యే స‌రికే ఐదేళ్ల టైం తీసేసుకున్నారు. ఇప్పుడు కూడా ఏపీ ఎన్నిక‌ల వ‌ర‌కే ప‌రిమితం అయిపోయిన ప‌వ‌న్‌... మొన్న‌టి తెలంగాణ ఎన్నిక‌ల వైపు చూసే సాహ‌స‌మే చేయ‌లేదు. స‌రే.... ఐదేళ్ల త‌ర్వాత అయినా ప‌వన్ బ‌రిలోకి దిగుతున్నాడులే... ఏపీ రాజ‌కీయాలు పూర్తిగా మారిపోతాయిలే అని మురిసిపోయే అవ‌కాశాన్ని ఆయ‌న త‌న ఫ్యాన్స్‌ కు ఇవ్వ‌డం లేదు. అంతేకాదండోయ్... మ‌న‌కు ఈ సారి ఓట‌మి త‌ప్ప‌ద‌ని చెబుతూ వారిని తీవ్ర ఆందోళ‌న‌లోకి నెట్టేస్తున్నారు. అయినా ప‌వ‌న్ ఎప్పుడు ఏం మాట్లాడ‌తారో ఎవ‌రికీ తెలియ‌దు క‌దా.

ఇప్ప‌టికే ఈ ఎన్నిక‌ల్లో తాను సీఎం కావాల‌నుకోవ‌డం లేద‌ని ఓ సారి - సీఎం అవుతాన‌ని మ‌రోసారి ప‌ర‌స్ప‌ర విరుద్ధ ప్ర‌క‌ట‌న‌లు గుప్పించిన ప‌వ‌న్‌... త‌న‌పై త‌న‌కే న‌మ్మ‌కం లేద‌న్న రీతిలో ఓ స్ప‌ష్ట‌త‌ను అయితే ఇచ్చార‌నే చెప్పాలి. తాజాగా ప్ర‌కాశం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న మ‌రో కొత్త అంశంపైనా స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఏదో పొడిచేస్తుంద‌ని అయితే త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని ప‌వ‌న్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. ఈ ఎన్నిక‌ల్లో అద్భుతాలు జ‌రుగుతాయ‌ని తాను అనుకోవ‌డం లేద‌ని త‌న నోటితోనే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ప‌వ‌న్‌... ఈ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ పెద్ద‌గా ఒర‌గ‌బెట్టేదేమీ లేద‌ని తేల్చి చెప్పార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

అయినా ఈ దిశ‌గా ప‌వ‌న్ ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *డబ్బుతో రాజకీయాలు చేసేయొచ్చని అనుకుంటే ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఐదారుసార్లు ముఖ్యమంత్రి అయి ఉండేవారు. ఓ బలమైన మార్పు కావాలని కోరుకుంటున్నప్పుడు అది ఓ సునామీలా వచ్చి ఉన్న వ్యవస్థని తుడిచిపెట్టేస్తుంది. బలమైన మార్పు తీసుకురావాలన్న ఆకాంక్ష నాలో ఉంది. జనసేనతో కలిసి నడవాలనుకున్న వారు సుదీర్ఘ ప్రయాణం పెట్టుకోవాల్సిందే. 2019లో అద్భుతాలు జరుగుతాయని మాత్రం అనుకోవద్దు. ఒక్కో సమయంలో భగవంతుడు ఆశ్చర్యకరరీతిలో ఫలితం ఇవ్వొచ్చు. జనసేనకు బలం లేదని  ప్రత్యర్థులు చెప్ప‌డం సబబు కాదు. మ‌న‌కు బ‌లం ఉంది* అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. అంటే... త‌న‌కు బ‌లం లేద‌ని వేరే వారు చెబితే ఒప్పుకునేందుకు సిద్ధంగా లేని ప‌వ‌న్‌... తాను మాత్రం ఈ ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేన‌ని చెప్పేసిన‌ట్టే క‌దా.
Tags:    

Similar News