కేసీఆర్‌ కు థ్యాంక్స్ చెప్పిన ప‌వ‌న్‌

Update: 2017-08-01 05:26 GMT
గులాబీ ద‌ళ‌ప‌తి,తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. ఎందుకు? ఇటీవ‌లే క‌దా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మీడియా ప్ర‌చారం చేస్తున్నంత స్థాయిలో మ‌ద్ద‌తులేద‌ని చెప్పింది. ``కేవ‌లం చేతులు ఊపితేనే ఓట్లు వ‌స్తాయా? ప్ర‌చారంలో ఉన్నంతగా ఓట్లు ప‌వ‌న్‌కు రావు. కేవ‌లం 1.2 శాతం మాత్ర‌మే వ‌స్తాయి` అని కించ‌ప‌రిచారు క‌దా అయినా ప‌వ‌న్ ఎందుకు థ్యాంక్స్ చెప్పారు? `` అనే మీ సందేహం వంద శాతం నిజ‌మే. అయితే ప‌వ‌న్ థ్యాంక్స్ చెప్పింది కూడా ఇదే పాయింట్ పై అనేది మీరు గ‌మ‌నించాల్సిన విష‌యం.

అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్ 2019 ఎన్నికల్లో జనసేనకు 1.2%ఓట్లు వస్తాయని కేసీఆర్‌ ఒప్పుకున్నందుకు చాలా సంతోషమని పవన్‌కళ్యాన్‌ అన్నారు. ప్ర‌జ‌ల్లో ఎవ‌రి బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు వారికి ఉంటాయని ఇంకా ఎంట్రీ ఇవ్వ‌క‌ముందే త‌న బ‌లం గురించి ఎలా చెప్పుకోగ‌ల‌న‌ని కూడా ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. ఇక పాదయాత్ర చేయడం గురించి ప్ర‌స్తావించ‌గా ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఇచ్చారు. పాద‌యాత్ర ఇష్టమేనని, కాని పాదయాత్ర చేస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని అభిప్రాయపడ్డారు. మ‌రే రూపంలో అయినా అంటే బ‌స్సుయాత్ర‌లు, ర్యాలీలు వంటి వాటి రూపంలో ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతాన‌ని చెప్పారు.

కాగా, ఇటీవ‌లి ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీలోని విలేక‌రుల‌తో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ త‌న‌దైన శైలిలో ప్రాంతీయ, జాతీయ‌, రాజ‌కీయ‌, రాజకీయేత‌ర అంశాల‌పై రియాక్ట‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఏపీ రాజ‌కీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీకి గ‌డ్డుకాలం వీస్తోంద‌ని, ప్ర‌తిప‌క్ష వైసీపీకి అధికారం ద‌క్కే చాన్స్ ఉంద‌ని కేసీఆర్ విశ్లేషించారు.  ఆంధ్ర‌లో రాజ‌కీయ ప‌రిస్థితిపై చేసిన స‌ర్వే వివ‌రాలు ఓ మిత్రుడు చెప్పాడని 45శాతం వైఎస్సార్‌ సీపీ - 43శాతం టీడీపీ - 2.6 బీజేపీ - 1-1.2 ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కి  ఓట్లు వ‌స్తాయని స‌ర్వే వివ‌రాలొచ్చాయని కేసీఆర్‌ అన్నారు.
Tags:    

Similar News