పవన్ పోటీ చేసే నియోజకవర్గం డిసైడైంది

Update: 2023-07-01 21:49 GMT
ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు ఇంతకంటే పెద్ద ప్రశ్న వేరే ఏదీ లేదు. పవన్ కళ్యాణ్‌ను నిశితంగా పరిశీలిస్తున్న వైసీపీ, టీడీపీల నాయకులు, కార్యకర్తలే కాదు.. పవన్ సొంత పార్టీ జనసేన నాయకులు, కార్యకర్తలకూ అంతుచిక్కని ప్రశ్న ఇది. అనేక నియోజకవర్గాల పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ, ఊహాగానాలు రకరకాలుగా సాగుతున్నప్పటికీ ప్రధానంగా వినిపిస్తున్నవైతే నాలుగు పేర్లు.. అవి పవన్ గతంలో పోటీ చేసి ఓటమి పాలైన గాజువాక, భీమవరం.. వాటితో పాటు పిఠాపురం, నర్సాపురం. ఈ నాలుగులోనూ మరీ ఎక్కువగా భీమవరం, పిఠాపురం నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే, ఇంతకీ పవన్ మనసులో ఏముంది.. పవన్ బాగా నమ్ముతున్నవారు ఆయనకు ఏమని సూచిస్తున్నారు.. పవన్ ఇస్తున్న ఇండికేషన్స్ ఏమని చెప్తున్నాయి? ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఆయన ఈసారి భీమవరం నుంచి బరిలో దిగుతారని తెలుస్తోంది. జనసేనలోని కీలక నేతలు కొందరు కూడా ఇదే మాట చెప్తున్నారు.

వచ్చే ఎన్నికలకు పవన్ భీమవరం బరి నుంచే వైసీపీతో తలపడతారని, అసెంబ్లీలో అడుగుపెడతారని చెప్తున్నారు. పవన్ తన వారాహి తొలివిడత యాత్రను కూడా భీమవరంలోనే ముగించారు.

ఈ సందర్భంగా ఆయన దాదాపు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అసెంబ్లీలో ఈసారి తాను అడుగుపెట్టడం ఖాయమంటూ ఆయన కాన్ఫిడెన్స్ కనబరిచారు. భీమవరాన్ని తన నేలగా వర్ణించారు పవన్. ఇక్కడ ఓడినా తనకు బాధ కలగలేదని, ఈసారి తనను గెలిపించాలని ఆయన సూటిగా కోరారు. దీంతో ఆయన భీమవరం నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.

కాగా పవన్ బాగా నమ్మే, గౌరవించే సీనియర్ కాపు నేత చేగొండ హరిరామ జోగయ్య చేయించిన సర్వేలు కూడా పవన్‌కు గోదావరి జిల్లాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని తేల్చడమే కాకుండా భీమవరంలో పవన్ పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలుస్తారని కూడా తేల్చాయి.

మరోవైపు పవన్ భీమవరంలో మూడు రోజులు మకాం వేసి వివిధ వర్గాలతో చర్చించారు. కాపులతో పాటు క్షత్రియ, శెట్టిబలిజ వర్గాల వారితోనూ భేటీలు జరిపినట్లు చెప్తున్నారు. అక్కడి సామాజిక సమీకరణలు, ఏ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయన్న లెక్కలు పక్కాగా తెప్పించుకుని సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Similar News