జగన్ కు పీకే వీడియో మెసేజ్.. పస ఎంత?

Update: 2019-11-24 07:00 GMT
సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిషు బోధన మీద ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్ననిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతలా వ్యతిరేకిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ వాదనను సీఎం జగన్ తో పాటు.. ఆ పార్టీ నేతలు పలువురు తిప్పి కొడుతున్నారు. ఇదిలా ఉంటే.. తనపైనా..తన వాదనపైనా విమర్శలు చేస్తున్న ఏపీ అధికారపక్షంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

తాను చేస్తున్న వాదనలో వాస్తవం ఎంతన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్న జనసేన అధినేత తాజాగా సీఎం జగన్ కు ట్వీట్ రూపంలో వీడియో మెసేజ్ పంపారు. సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిషు బోధనపై మన నుడి.. మన నది పేరుతో పవన్ స్టార్ట్ చేసిన ఉద్యమంలో భాగంగా తాజాగా ఆయన పలు ట్వీట్లు చేశారు.

ఏ విషయమైనా తెలుగులో చెప్పినప్పుడు సులువుగా అర్థమవుతుందన్న ఆయన.. ట్వీట్లతో పాటు వీడియోలను పోస్టు చేశారు. సంస్కృత స్లోకాలను.. స్తోత్రాలను ఇంగ్లీషులో చెబితే అర్థమవుతుందా? అని ప్రశ్నించారు. తాను పోస్టు చేసిన వీడియోల్ని చూస్తే తెలుగు ప్రాధాన్యమేమిటో అర్థమవుతుందంటూ సీఎం జగన్ తీరును విమర్శించే ప్రయత్నం చేశారు.

తెలుగు బాషకు మూలం దేవభాషగా పిలిచే సంస్కృతమని.. ద్వాపర యుగంలో లిఖితమైన భగవద్గీత కానీ.. శంకరాచార్య విరచితం వివాష్టకం కానీ భక్తితో పాటు సంస్కృత భాష గొప్పతనాన్ని తెలియజేస్తాయన్నారు. మనో వికాసానికైనా.. మత ప్రచారానికైనా మనకు తెలిసిన భాషలో చెప్పినప్పుడే సామాన్యులకు సులువుగా అర్థమవుతుందన్న పవన్.. తాను పోస్టు చేసిన వీడియోల్లోని స్తోత్రాలను ఇంగ్లీషులో చెబితే సామాన్యులకు అర్థమవుతాయా? అంటూ ప్రశ్నించారు.

ఇన్ని ప్రశ్నలు వేస్తున్న పవన్.. తన పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదువుతున్నారా? తెలుగు మీడియంలో చదువుతున్నారా? అన్న సూటి ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పక పోవటం గమనార్హం. ప్రశ్నలు వేసే పవన్.. తనకు సంధించిన సందేహాల్ని తీర్చాల్సిన అవసరం ఉంది కదా పవన్?
Tags:    

Similar News