పవన్ వర్సెస్ ముద్రగడ...ప్లాన్ అదిరింది!

Update: 2022-12-10 16:30 GMT
జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కి అధ్యక్షా అని అనాలని ఉంది. ఆయన ప్రఖ్యాత తెలుగు చలన చిత్ర నటుడు. ఎంతో మంది ఎమ్మెల్యేలుగా నెగ్గుతున్న వేళ పవన్ కూడా ఎందుకు చట్ట సభలో సభ్యుడు కాకూడదు. బ్యాడ్ లక్ 2019 ఎన్నికల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. అది బయట వినిపించే మాట. అలా కాకుండా చేశారు ఇది తెర వెనక రాజకీయం.

ఆ పని చేసింది ఎవరు అంటే ప్రత్యర్ధి పార్టీలే. పవన్ కి ప్రత్యర్ధి ఎవరు అంటే వైసీపీ అనే చెప్పుకోవాలి. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేశారు. అయితే రెండు చోట్లా ఆయన ఓడారు. విపక్ష స్థానం నుంచి వైసీపీ సర్కార్ ని కడిగేసే సీన్ ఆయనకు లభించలేదు.

ఇక ఇపుడు చూసే 2024 ఎన్నికల్లో తాను గెలవడమే కాదు సీఎం కూడా కావాలని పవన్ ఆలోచన చేస్తున్నారు. అది సాధ్యమేనా అంటే రాజకీయ పార్టీ అంటే దానికో టార్గెట్ ఉంటుంది. అందువల్ల పవన్ ఆలోచనలు ఆయనవి. అయితే పవన్ ఇప్పటిదాకా తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానో చెప్పలేదు. దాంతో ఆయన గురించి వైసీపీలోనే తీవ్రమైన చర్చ సాగుతోంది.

వచ్చే ఎన్నికల్లోనూ పవన్ గెలవడానికి వీలులేదు అని వైసీపీ పెద్దలు పట్టుబడుతున్నారుట. ఆయన అసెంబ్లీకి రాకూడదు అంతే అని కీలక నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్లుగా పక్కా ప్లాన్ తో వైసీపీ ఉంది అని అంటున్నారు. పవన్ ఈసారి ఎక్కడ పోటీ చేస్తారో జనసేన వర్గాలు చెప్పలేదు కానీ వైసీపీకి మాత్రం దాని మీద పక్కా సమాచారం ఉందిట.

పవన్ ఈసారి భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేయరు. ఆయన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుంచి బరిలో ఉంటారని అంటున్నారు. పవన్ అక్కడ నుంచి పోటీ చేయడానికి కారణం జనసేనకు అక్కడ సొంతంగా కొంత బలం ఉంది. పైగా 2009 ఎన్నికల్లో కూడా ఆ సీటుని ప్రజారాజ్యం గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో జనసేన తరఫున మాకినీడు శేషుకుమారి జనసేన తరఫున పోటీ చేస్తే 27 వేల దాకా ఓట్లు వచ్చాయి.

కాపులు ఎక్కువ.వారంతా పవన్ కి జై కొడుతున్నారు. పార్టీలకు అతీతంగా వారు మద్దతుగా ఉంటున్నారు. దాంతో పవన్ పిఠాపురంలో పీట వేసుకుని కూర్చుంటారు అన్న చర్చ అయితే ఉంది. దాంతో వైసీపీ కూడా పిఠాపురంలో పవన్ పోటీ చేస్తే ఎలా ఓడించాలి అన్న ప్లాన్ ఒకటి రెడీ చేసుకుని పెట్టుకుందిట.

పిఠాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టికెట్ ఇవ్వరు. ఆయన పట్ల వ్యతిరేకత అలా ఉంది. దాంతో కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని వైసీపీ ఆలోచిస్తోంది. పైగా ఆమె 2009లో పీయార్పీ తరఫున ఎమ్మెల్యేగా అక్కడ నుంచి గెలిచారు. ఆమెకు మంచి బలం ఉంది అందువల్ల ఆమె గట్టి అభ్యర్ధి అని అంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా దిగితే మాత్రం ఆయన్ని తట్టుకోవడానికి ప్లాన్ బీని కూడా రెడీ చేసి పెట్టుకుంది అంటున్నారు. కాపు నేత సీనియర్ పొలిటీషియన్ అయిన ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ తరఫున పిఠాపురం నుంచి పోటీ చేయించేందుకు కూడా వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది అని అంటున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఆయనతో వైసీపీ నేతలు రాయబారాలు జరిపారు.

ఆయన ఏమన్నారు అన్న దాని కంటే కూడా ఆయన్ని ఎలాగైనా తమ వైపునకు తెచ్చుకోవాలన్న వైసీపీ ఆరాటమే ఎక్కువగా ఉంది. దాంతో ముద్రగడ కనుక ఓకే అంటే పవన్ వర్సెస్ ముద్రగడగా పిఠాపురం ఎన్నికను వేదికగా చేసుకోవాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. ముద్రగడను ముందు పెట్టి తెర వెనక పవన్ని ఓడించే పటిష్టమైన పధకానికి కూడా వైసీపీ వ్యూహ రచన చేస్తోంది అని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ కదా. ఆయన సీట్లో ఓడుతారా. జనసేన అంతలా ఈ ఎన్నికలు లైట్ తీసుకుంటుందా. అదే జరిగితే ఏపీ అంతా పిఠాపురం వైపే చూస్తుంది అన్నది నిజం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News