ఏపీ బ్రాండ్ ఇమేజ్ కు దెబ్బేస్తున్న ప‌వ‌న్‌?

Update: 2018-06-30 08:25 GMT
ప్ర‌జ‌ల్ని ప్ర‌భావితం చేసే ముఖ్య‌నేత‌ల నోటి నుంచి వ‌చ్చే మాట‌లు ఆచితూచి అన్న‌ట్లుగా ఉండాలి. ఇక‌.. కొన్ని విష‌యాల్లో త‌మ వాద‌న‌ను వినిపించే ముందు స‌మ‌కాలీన ప‌రిస్థితుల్ని.. చుట్టూ ఉన్న రాష్ట్రాల ఉదాహ‌ర‌ణ‌ల్ని చూసి మాట్లాడాలి. ఇందులో ఏ మాత్రం తేడా వ‌చ్చినా మొద‌టికే మోసం వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఎవ‌రిచ్చిన ఫీడ్ బ్యాకో తెలీదు కానీ.. ఈ మ‌ధ్య‌న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న వ్యాఖ్య‌లు ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉన్నాయి.

స‌మ‌కాలీన ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ లాంటి నేత నోటి ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు రావ‌టం ఏమిట‌న్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇటీవ‌ల విశాఖ‌లో ఐటీ కంపెనీల‌కు కేటాయించిన భూముల్లో ప‌ర్య‌టించిన ప‌వ‌న్‌.. ఐటీ కంపెనీల్లో స్థానికుల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్న డిమాండ్‌ ను తెర మీద‌కు తెచ్చారు.

ప్ర‌స్తుతం న‌డుస్తున్న గ్లోబ‌లైజేష‌న్.. అందునా ఐటీ రంగానికి ఏమాత్రం సూట్ కాని లోక‌ల్ నినాదాన్ని ప‌వ‌న్ తెర మీద‌కు తీసుకురావ‌టంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఐటీ రంగంలో టాలెంట్ కు త‌ప్పించి మ‌రే అంశానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌రు. పూర్తి వాణిజ్య సూత్రాల మీద న‌డిచే ఐటీ ప‌రిశ్ర‌మ‌.. టాలెంట్‌కు పెద్ద పీట వేస్తుంది.

ఈ కార‌ణంతోనే ప్రాంతాల‌తో సంబంధం లేకుండా.. విష‌యం ఉన్న వారికి అవ‌కాశాలివ్వ‌టం చూడొచ్చు. ఏపీకి ప‌క్క‌నే ఉన్న హైద‌రాబాద్ సంగ‌తే చూడండి. అక్క‌డి ఐటీ ప‌రిశ్ర‌మ‌లో తెల‌గువారితో పాటు ద‌క్షిణాది వారు.. ఉత్త‌రాదివారు భారీగా ఉంటారు. నీళ్లు.. నిధులు..నియామ‌కాలు అన్న మూడు అంశాల మీద న‌డిచిన ఉద్య‌మం త‌ర్వాత ఏర్ప‌డిన తెలంగాణ‌లోనూ.. స్థానికుల‌కు ఐటీ రంగాల్లో పెద్ద పీట వేయాల‌న్న మాట మ‌హా ఉద్య‌మ నేత అయిన కేసీఆర్ నోటి రాక‌పోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

అంతెందుకు.. బెంగ‌ళూరు.. చెన్నై.. చివ‌ర‌కు అమెరికాలోనూ టాలెంట్‌ కు పెద్ద పీట వేస్తున్నారే కానీ.. స్థానిక‌త‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకోరు. ఒక‌వేళ‌.. దాన్నే తీసుకుంటే.. హైద‌రాబాద్‌ లో ఉన్న ల‌క్ష‌లాది ఏపీ ప్ర‌జ‌ల‌కు మ‌హా ఇబ్బంది క‌ల‌గ‌క మాన‌దు. ప‌వ‌న్ చెప్పిన‌ట్లుగా లోక‌ల్ కు ప్రాధాన్య‌త ఇస్తే.. బెంగ‌ళూరు.. చెన్నై..అమెరికాలోని ఏపీ ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌. అందుకే.. మాట అనే ముందు కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుంద‌న్న సూచ‌న ప‌వ‌న్ కు ప‌లువురి నుంచి వ‌స్తోంది.

Tags:    

Similar News