బీజేపీకి విడాకులు ఇవ్వడానికే పవన్‌ ఢిల్లీ వెళ్లారు

Update: 2023-04-07 14:00 GMT
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పదేపదే స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2014లో మాదిరిగా టీడీపీ–జనసేన–బీజేపీ కలసి పోటీ చేయాలనేది పవన్‌ వ్యూహమని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం పవన్‌ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపి వచ్చారు. అయితే పొత్తులకు ఇంకా సమయం ఉందని.. సమయం వచ్చినప్పుడు పొత్తుల గురించి ప్రకటిస్తామని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో వైసీపీ.. పవన్‌ కల్యాణ్‌ పై విమర్శలు ఎక్కుపెట్టింది. తోడేళ్లు అన్నీ పొత్తులతో, జిత్తులతో కలసి వచ్చినా తాము ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధిస్తామని సీఎం జగన్‌ ఢంకా బజాయిస్తున్నారు.

ఈ క్రమంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ వెళ్లింది బీజేపీ తో విడాకులు తీసుకోవడానికేనని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ముక్కోణపు ప్రేమ నడుస్తోందని అంబటి ఎద్దేవా చేశారు. బీజేపీని మళ్లీ తెలుగుదేశంతో కలపాలని పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా కోరుకుంటున్నారని తెలిపారు. టీడీపీ కోసం బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారన్నారు. పవన్‌ నిస్సందేహంగా ప్యాకేజీ స్టార్‌ అని అంబటి దుయ్యబట్టారు.

టీడీపీ బ్యాచ్‌ తానా అంటే వారాహి బ్యాచ్‌ తందానా అంటోందని హాట్‌ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు సూచనతోనే పవన్‌ ఢిల్లీ వెళ్లారని అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేలా బీజేపీ పెద్దలతో పవన్‌ చర్చలు జరిపారన్నారు. చంద్రబాబును సీఎం చేయడం కోసమే రాజకీయాలు చేస్తున్నప్పుడు బీజేపీతో జనసేన ఎందుకు పొత్తు పెట్టుకుందని నిలదీశారు. ఒక రాజకీయ పార్టీగా ఈ విషయంలో సిగ్గు అనిపించడం లేదా అని పవన్‌ ను ప్రశ్నించారు.

చంద్రబాబుకు ఏం కావాలో అది పవన్‌ వద్ద ఉందని అంబటి వ్యాఖ్యానించారు. అలాగే పవన్‌ కు కావాల్సిన బరువు చంద్రబాబు వద్ద ఉందన్నారు. నాలుగు కాపు ఓట్లను చీల్చి చంద్రబాబుకు మేలు చేయాలని పవన్‌ కల్యాణ్‌ ప్రయత్నిస్తున్నారని అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీకి కక్తుర్తి పడి ఒక కులం మొత్తాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం పవన్‌ చేస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు. పోలవరంపై పవన్‌ కు ఏమీ తెలియదన్నారు. పవన్‌ కు సర్వం అయిన నాదెండ్ల మనోహర్‌ కు తెలిసిందల్లా చంద్రబాబుతో మాట్లాడి పవన్‌ కు ప్యాకేజీ ఇప్పించడమేనని ఆరోపించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News