వెంక‌య్య‌కు ప‌వ‌న్ గ్రీటింగ్స్‌...!!

Update: 2017-07-18 04:19 GMT
ఆల‌స్యంగా స్పందిస్తారు....త‌న అభిప్రాయాల ప్ర‌కారం న‌డుచుకుంటారే త‌ప్ప ప‌రిణ‌తి చెందిన రాజ‌కీయ‌వేత్త‌గా వ్య‌వ‌హ‌రించ‌లేరు అనే అపప్ర‌ద‌ను ప‌లు వ‌ర్గాల్లో మూట‌గ‌ట్టుకున్న జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాన్నుంచి మెల్లిమెల్లిగా బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఏపీలో కల‌క‌లం రేకెత్తిస్తున్న వైజాగ్ భూ కుంభ‌కోణం విష‌యంలో ప్ర‌శ్నించేందుకే ఉన్నాన‌నే నాయ‌కుడనే పేరున్న‌ప్ప‌టికీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పంద‌న లేక‌పోవ‌డం, కీల‌క‌మైన‌ నంద్యాల ఉప ఎన్నిక‌పై త‌న అభిప్రాయం వినిపించ‌క‌పోవ‌డం ద్వారా ప‌వ‌న్‌కు రాజ‌కీయాల‌పై పూర్తి ప‌ట్టు ఇంకా దొర‌క‌లేద‌ని ప‌లువురు విమ‌ర్శించి సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప‌వ‌న్ అలాంటి ఫ్రేమ్‌ లో నుంచి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నం చేశారని అంటున్నారు. ఉప‌రాష్ట్రప‌తి ప‌దవికి ఎన్డీఏ అభ్య‌ర్థిగా ఎంపిక‌యిన బీజేపీ సీనియ‌ర్ నేత ఎం.వెంక‌య్య‌నాయుడుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ సార‌థ్యంలో బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ త‌మ కూటమి త‌ర‌ఫున ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా వెంక‌య్య‌నాయుడును ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌క‌టించిన అనంత‌రం సోమ‌వారం రాత్రి ప‌వ‌న్ స్పంద‌న‌తో జ‌న‌సేన పార్టీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌లో వెంక‌య్య‌నాయుడుకు ప‌వ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు. అంతేకాకుండా బీజేపీ అధిష్టానానికి సైతం ప‌వ‌న్ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా వెంక‌య్య‌కు అడ్వాన్స్ కంగ్రాట్స్ తెలిపిన ప‌వ‌న్...ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వికి ఆయ‌న వ‌న్నె తెస్తార‌ని ధీమా వ్య‌క్తం చేయ‌డం విశేషం. కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా - విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ద‌క్కాల్సిన హామీల విష‌యంలో గతంలో వెంక‌య్య‌నాయుడు ల‌క్ష్యంగా ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ప‌లు విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే అలా కొన్ని సంద‌ర్భాల్లో జ‌రిగిన మాట‌ల యుద్ధాన్ని ప‌క్క‌న‌పెట్టి తెలుగువ్య‌క్తి అయిన వెంక‌య్య‌నాయ‌డుకు కీల‌క ప‌ద‌వికి పోటీ ప‌డుతున్న సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జెప్ప‌డం ద్వారా `రాజ‌కీయ నాయ‌కుడు` అనే భావ‌న‌ను ప‌వ‌న్ పంపించ‌గ‌లిగార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

కాగా, వెంక‌య్య‌నాయుడుకు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర‌ఫున జ‌నసేన పార్టీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ఇది `` ఉప రాష్ట్రపతి పదవికి బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన తెలుగు బిడ్డ - గౌరవనీయులైన వెంకయ్య నాయుడు గారికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సీనియర్ రాజకీయ నాయకునిగా అపార అనుభవమున్న వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రప‌తి పదవికి వన్నె తెస్తారని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఇది తెలుగు వారందరూ గర్వించదగిన పరిణామంగా,తెలుగు వారికి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. వెంకయ్య నాయుడు గారిని అభ్యర్థిగా ఎంపిక చేసిన బీజేపీ అధినాయకత్వానికి అభినందనలు తెలియచేస్తున్నాను. -జైహింద్`` అంటూ శుభాకాంక్ష‌లు తెలిపారు.
Tags:    

Similar News