నాలుగేళ్ళ తరువాత పవన్ కి అపాయింట్మెంట్ ఇచ్చిన మోడీ

Update: 2022-11-11 04:34 GMT
జనసేన అధినేతగా పవన్ 2014లో ఏపీలో నాటి ఎన్డీయే ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీతో కలసి ఏపీ అంతా తిరిగి సభలలో ప్రసంగించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. నాడు మోడీ పవన్ సభలలో పక్కపక్కన కూర్చుని ఎన్నో ముచ్చట్లు చెప్పుకునేవారు. ఆ తరువాత మూడేళ్ల పాటు అదే సాన్నిహిత్యం నడచింది.

సీన్ కట్ చేస్తే 2017 తరువాత బీజేపీ తో పవన్ కటీఫ్ అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ ఆయన బీజేపీని వీడి వెళ్లారు. నాటి నుంచి తెగిన ఆ బంధం 2020లో మళ్ళీ చిగురించింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని మూడున్నరేళ్ళుగా పవన్ ఎన్డీయే  మిత్రుడుగా కొనసాగుతున్నారు.

అలా చెప్పాలంటే చెప్పాలి తప్ప ఢిల్లీకి పవన్ ఎపుడు వెళ్ళినా మోడీ, అమిత్ షాల అపాయింట్మెంట్ అయితే దొరకడంలేదు. దాంతో బీజేపీ జనసేనల బంధం మీద కూడా ప్రశ్నలు ఉదయించాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఏడాది మార్చిలో జనసేన ఆవిర్భావ సభలో పవన్ బీజేపీ వారికి రోడ్ మ్యాప్ అడిగారు. దానికి వారి నుంచి ఇప్పటిదాకా సమాధానం లేదు.

ఇలా రెండు పార్టీల మధ్య  గ్యాప్ పెరుగుతున్న తరుణంలో ఈ మధ్యనే మంగళగిరి పార్టీ ఆఫీసులో కార్యకర్తలతో పవన్ మాట్లాడుతూ తాను కొత్త మార్గాలను అన్వేషించుకోక తప్పేట్లు లేదని చెప్పడం జరిగింది. ఆ తరువాత విజయవాడలోని ఒక హొటల్ లో పవన్ తో చంద్రబాబు భేటీ కావడంతో ఏపీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. ఇవన్నీ ఇలా ఉంటే మోడీతో అపాయింట్మెంట్ కోసం పవన్ చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అని ప్రచారం అయితే సాగింది.

కానీ ఎందుకో ఈ ఇద్దరు భేటీ కుదరడంలేదు. ఎట్టకేలకు దానికి విశాఖ వేదిక అవుతోంది. విశాఖకు ఈ రోజు రాత్రి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఒక పది నిముషాల పాటు పవన్ కళ్యాణ్ కి అపాయింట్మెంట్ ఇచ్చారని తెలుస్తోంది. ఇది పీ ఎం ఓ  నుంచి ఖరారైన అపాయింట్మెంట్ గా చెబుతున్నారు. రాత్రికి విశాఖ నేవే అతిధి గృహం ఐ ఎన్ ఎస్ చోళాలో ప్రధాని బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పవన్ భేటీ అవుతారు.

ఈ విధంగా నాలుగేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ఈ ఇద్దరి భేటీ జరగబోతోంది. మరి ఈ భేటీలో పవన్ ఏమి చెబుతారు, బీజేపీ జనసేన సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది కూడా కీలకమైన విషయంగానే ఉంది. ఇప్పటికైతే అంతా అనుకుంటున్నది ప్రచారంలో ఉన్నది చూస్తే పవన్ ఏపీలో ఉన్న అధికార వైసీపీ ప్రభుత్వం మీద ప్రధానికి ఫిర్యాదు చేయబోతున్నారు అని అంటున్నారు. ఏపీలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని ఆయన చెప్పబోతున్నారు అని అంటున్నారు.

అదే విధంగా రీసెంట్ గా విశాఖలో ఒక హొటల్ గదిలో తనను ఉంచి పోలీసులు పెట్టిన ఇబ్బందులను కూడా పవన్ చెప్పబోతున్నారు అని అంటున్నారు. వీటితో పాటు బీజేపీ కేంద్ర నాయకత్వం ఏ వైపు ఉంది అన్నది ప్రధాని మనసులో మాటను కూడా పవన్ ఈ భేటీ సందర్భంగా తెలుసుకోబోతున్నారు అని అంటున్నారు. ఏపీలో వైసీపీ సర్కార్ తో కేంద్రం దోస్తీ చేస్తోంది అన్న అనుమానాలు ఆయనకు ఉన్నాయి.

దాంతో వాటిని నివృత్తి చేసుకోవడానికి కూడా ఈ భేటీని ఉపయోగించుకుంటారు అని అంటున్నారు. అలాగే ప్రధాని కూడా జనసేన ఏ వైపు ఉంటోంది అన్నది ఆరా తీయబోతున్నారు అని అంటున్నారు. ఇప్పటికైతే టీడీపీతో జనసేన కలసి నడుస్తుంది అని అంతా ప్రచారం సాగుతోంది. మరి టీడీపీకి తాము దూరమని ప్రధాని ఈ భేటీలో ఏమైనా చెబుతారా అన్నది కూడా ఆసక్తికరమైన చర్చ. అదే జరిగితే పవన్ జనసేన బీజేపీ ఏపీలో ఒక కూటమిలా కంటిన్యూ అవుతారా ఇది కూడా ప్రశ్నగానే ఉంది.

ఇలా చాలా సందేహాలు ఉన్నాయి. ఈ ఇద్దరి భేటీలో చాలా విషయాలు మాత్రం ప్రస్తావనకు రానున్నాయి. ఏది ఏమైనా ఒక విషయం మాత్రం స్పష్టం. బీజేపీ పవన్ని అసలు పట్టించుకోవడంలేదు. ఆయన పొత్తుని అలా గాలికి వదిలేసింది. ప్రధాని మోడీ పవన్ కి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడంలేదు అని వైసీపీ నాయకులు సాహా పవన్ ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలకు ఈ భేటీ కచ్చితమైన జవాబు చెబుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News