పవన్ అజెండా ఇదేనా ?

Update: 2023-03-02 14:00 GMT
ఈనెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం జరగబోతోంది. ఇందులో భాగంగా మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. 34 ఎకరాల్లో జరగబోయే బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది నాయకత్వం. సభ నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులను పార్టీ నాయకత్వం ఇప్పటికే పోలీసుల నుండి తీసుకున్నది. అంతా బాగానే ఉంది కానీ బహిరంగ సభ మచిలీపట్నంలోనే పెట్టాలని ఎందుకు నిర్ణయించినట్లు ?

ఎందుకంటే టార్గెట్ పేర్ని నాని అని స్పష్టంగా అర్థమైపోతోంది. బహిరంగ సభను పవన్ ఎక్కడ నిర్వహించినా జనాలకు అయితే కొదవుండదు.  ఓటు హక్కులేని వాళ్ళు చాలామంది పవన్ సభంటే రెచ్చిపోతారు. అయితే పర్టిక్యులర్ గా మచిలీపట్నంలోనే సభ నిర్వహించాలనే నిర్ణయం వెనుక కాపులకు సంకేతాలు ఇవ్వటమే అని అర్ధమవుతోంది. కాపులకు ప్రత్యేకించి పవన్ ఇచ్చే సంకేతాలు ఏముంటాయనేది ఆ రోజుకి కానీ తెలీదు. అయితే పేర్నినానిని టార్గెట్ చేయటం కూడా ఇందులో భాగమే అని అర్ధమవుతోంది.

పేర్ని కూడా కాపునేతే అన్న విషయం తెలిసిందే. పవన్ ని డైరెక్ట్ ఎటాక్ చేస్తున్న వాళ్ళల్లో పేర్ని ముందుంటారు. స్వయంగా కాపునేత అయిన పేర్ని జనసేన అధినేతను పదేపదే ఎటాక్ చేస్తున్నారు. పేర్ని దాడికి పవన్ దగ్గర సరైన సమాధానాలు కూడా ఉండటం లేదు. ఎంతసేపు తాను అనదలచుకున్నది అనేసి పవన్ వెళ్ళిపోతున్నారు.

పవన్ అన్నదాన్ని పట్టుకుని పేర్ని అండ్ కో మూడు నాలుగురోజుల పాటు చీల్చి చెండాడేస్తుంటారు. స్వతహాగానే మంచి మాటకారైన పేర్నినాని దెబ్బకు, ప్రశ్నలకు  పవన్ సమాధానం కూడా చెప్పేకోలేకపోతున్నారు.

వచ్చేఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని పవన్ పెట్టుకున్న వైసీపీ నేతల టార్గెట్లో పేర్నినాని కూడా ఉన్నారు. కంట్లో నలుసులాగ తయారైన నానీని ఓడించటమే టార్గెట్ గా పవన్ పావులు కదుపుతున్నారు. ఇందులో మచిలీపట్నంలో బహిరంగసభ నిర్వహించటం కూడా ఒకటి. సభ ద్వారా కాపులందరినీ జనసేన వైపుకు తిప్పుకోవాలన్నది పవన్ వ్యూహంగా కనబడుతోంది.

పేర్నికి మద్దతుగా ఉండే కాపుల్లోనే చీలిక తీసుకొచ్చి ఓడించాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్లున్నారు. అలాగే పొత్తుల విషయంలో క్లారిటి కూడా ఇచ్చే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం. మరి బహిరంగ సభలో పవన్ ఏమి మాట్లాడుతారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News