ఫ్యాన్స్ కంట్రోల్ విషయం తన చేతుల్లో లేదంటున్న పవన్!

Update: 2023-06-21 14:45 GMT
సాధారణంగా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో.. ట్రోల్స్ కూడా దాదాపు అదే స్థాయిలో ఉంటాయి. ఈ విషయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మరింత దూకుడుగా ఉంటారనే కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. దీనికి ఉదాహరణలు గతంలో ఎన్నో ఉన్నాయి కూడా! అయితే ఈ విషయాలపై తాజాగా జనసేన అధినేత పవన్ స్పందించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాను కంట్రోల్ చేసే విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన అభిమానులు, జనసైనికుల దూకుడును తాను నియంత్రించలేనని తెలిపారు. కొన్ని సందర్భాల్లో తనపై కూడా తన అభిమానులు ట్రోల్స్ చేసిన సందర్భాలు ఉన్నాయని పవన్ తెలిపారు. సోషల్ మీడియాను నియంత్రించడం దాదాపు అసాధ్యం అని పవన్ అంగీకరించారు.

తన పార్టీపై మీడియా నిర్మాణాత్మక విమర్శలు చేసినప్పటికీ.. అతని అభిమానులు, అనుచరులు మీడియా ప్లాట్‌ ఫారమ్‌ లను సైతం ట్రోలింగ్ చేయడం పై సందించిన ప్రశ్నకు పవన్ ఈ విధంగా స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాను నియంత్రించలేమని.. అది అసాధ్యమని.. ఈ విషయంలో తన ఫ్యాన్స్ తన మాట వినే అవకాశం దాదాపు ఉండదన్నట్లుగా పవన్ స్పందించారు.

ఈ విషయంలో ప్రత్యర్థులపై మాత్రమే కాకుండా... తనపై కూడా సోషల్ మీడియాలో దుర్భాషలాడుతుంటారని పవన్ చెప్పుకున్నారు. గతంలో తానా సమావేశానికి హాజరవుతున్నట్లు ప్రకటించినప్పుడు తన ఫ్యాన్స్ తనను గట్టిగానే తిట్టారని పవన్ గుర్తుచేసుకున్నారు. ఈ విషయంలో అభిమానులను నిరంతరం కోరుతూనే ఉంటాను కానీ... కొందరు మాత్రం తన సలహాలను సూచనలను ఏమాత్రం పట్టించుకోరని అనారు.

ఈ సమయంలో మరింత సీరియస్ గా స్పందించిన ఆయన... కొంతమంది అభిమానులు మిలిటెంట్ తరహా విధానాన్ని ప్రదర్శిస్తారంటూ పవన్ వ్యాఖ్యానించారు.

కాగా... ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాహి యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పవన్ తెలిపారు. ఇదే క్రమంలో తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన పోటీచేస్తుందని పవన్ స్పష్టం చేశారు. 

Similar News