ప‌వ‌న్ దండ యాత్ర .. ఎవ‌రికి ప్ల‌స్సో !

Update: 2022-06-20 11:30 GMT
ద‌స‌రా నుంచి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధానంగా యుద్ధం చేస్తాన‌ని అంటున్నారు జ‌న‌సేనాని పవ‌న్ కల్యాణ్. నిన్న‌టి వేళ (ఆదివారం,  జూన్ 19, 2022 ) ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా, ప‌ర్చూరులో కౌలు రైతుకు భ‌రోసా యాత్రను నిర్వ‌హించి, 72 బాధిత కుటుంబాల‌కు  లక్ష రూపాయ‌ల  చొప్పున వ్య‌క్తిగ‌త సాయం అందించి, ఆదుకున్నారు. కొన్ని చోట్ల ఆడ బిడ్డ‌ల చ‌దువుల‌కు తానే సాయం చేస్తాన‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో చ‌దువులు ఆప‌కూడ‌ద‌ని కూడా చెప్పారు.

అదేవిధంగా ఏ స‌మ‌స్య వచ్చినా స‌రే జ‌న‌సేన పార్టీ నాయ‌కుల దృష్టికి తీసుకువెళ్లాల‌ని, వీలున్నంత మేరకు త‌క్ష‌ణ స్పంద‌న మ‌రియు సాయం ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ఇదే సంద‌ర్భంగా ఇక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో త‌న‌కొక అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. ప్ర‌జ‌ల‌తోనే పొత్తులుంటాయ‌ని కూడా స్ప‌ష్టం చేసి ఆ రెండు పార్టీల‌కూ స్ప‌ష్ట‌మ‌యిన సంకేతాలు పంపారు. అంటే టీడీపీ తో కానీ బీజేపీతో కానీ పొత్తుల విష‌య‌మై మాట్లాడేందుకు ఇంకాస్త స‌మ‌యం ఉంద‌ని కూడా చెప్పారాయ‌న‌.

ఇక ద‌స‌రా త‌రువాత అధికార పార్టీ చేస్తున్న త‌ప్పిదాల‌పై, అదేవిధంగా తీసుకుంటున్న ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌పై పోరాటం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారాయ‌న‌. ఇదే స‌మయంలో ఇప్ప‌టిదాకా  ఐదు,ఆరు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు మేర‌కు అప్పులు తెచ్చారు.. వాటిలో ల‌క్ష‌న్న కోట్లు పంచారు.. మ‌రి! మిగిలిన మొత్తాల‌ను ఏం చేశారు అని కూడా ప్ర‌శ్నించారు. వీటిపై వైసీపీ ఏం అంటుందో కూడా చూడాలిక. అయితే ఇవాళ అప్పులకు సంబంధించి జ‌గ‌న్ వ‌ర్గాలు చెబుతున్న లెక్క‌లు వేరుగా ఉన్నాయి. రెండేళ్ల క‌రోనా కార‌ణంగా కొంత, టీడీపీ దిగిపోతూ దిగిపోతూ మిగిల్చిన అప్పు కొంత క‌లిపి ఆర్థిక భారం మోయాల్సి వ‌స్తోంద‌ని కూడా చెబుతోంది వైసీపీ. ఇందులో నిజం ఎంత.? వాస్త‌వ దూరం ఎంత.? అన్న‌ది   తెలియాల్సి ఉంది. మ‌రి!  

ద‌స‌రా నుంచి దూకుడు పెంచ‌నున్న ప‌వ‌న్ కార‌ణంగా అటు బీజేపీకి కానీ ఇటు టీడీపీకి కానీ ఏ మేర‌కు క‌లిసివ‌స్తుంద‌న్న‌ది ఇప్పుడొక చర్చ.  పవ‌న్ త‌న ప‌ర్య‌ట‌న‌ల్లో ఎక్క‌డా పొత్తుల గురించి పెద్ద‌గా మాట్లాడ‌డం లేదు. వీలున్నంత మేర‌కు బీజేపీతో వెళ్లే ఛాన్స్ ను కొట్టిపారేయ‌లేం అని మాత్ర‌మే జ‌న‌సేన నాయ‌కులు కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ కార్య‌క‌ర్త‌ల‌కు చెబుతూ వ‌స్తున్నారు.

క‌నుక ప‌వ‌న్ యాత్ర  కార‌ణంగా ప్ర‌జా స‌మ‌స్య‌లు కాస్త‌యినా ప‌రిష్కారానికి నోచుకుంటే , ఆ ప్ర‌భావంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో పాటు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న రాజ‌కీయ శ‌క్తులు కూడా ల‌బ్ధిపొంద‌డం ఖాయం. ఎందుకంటే ఇప్ప‌టిదాకా జన‌సేన ప్ర‌స్తావించిన ప్ర‌తి స‌మ‌స్య‌నూ వీలున్నంత వ‌ర‌కూ తీర్చేందుకు, ఆ విధంగా ప్ర‌జ‌ల్లో త‌మ‌పై నెలకొన్న చెడ్డ అభిప్రాయాన్ని తొల‌గించుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ఇక జ‌న‌సేన కూడా కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం కాకుండా బాధిత వ‌ర్గాల‌కు అంతో ఇంతో సాయం చేస్తుండ‌డం కూడా ఆ పార్టీపై జ‌నంలో సానుకూల దృక్ప‌థాన్ని పెంపొందిస్తోంది.

ఇప్ప‌టిదాకా ఏ పార్టీ చేయ‌ని విధంగా జ‌న‌సేన చేస్తున్న కౌలు రైతు భ‌రోసా యాత్ర అన్న‌ది ఇప్ప‌టికే మంచి ఫ‌లితాల‌ను అందుకుంటోంది. దీంతో అధికార వ‌ర్గాలు కూడా ఎక్క‌డిక్క‌డ అప్ర‌మ‌త్తం అవుతున్నాయి. ఇంట‌ర్న‌ల్ డిస్కష‌న్ల‌లో కూడా ప‌వ‌న్ వ‌చ్చి వెళ్లాక బాధిత వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వం ఏదో ఒక విధంగా సాయం చేయాల‌న్న నిర్ణ‌యానికే వ‌స్తోంది. ఇవ‌న్నీ ఓ విధంగా జ‌న‌సేన‌కు అనుకూల‌మే! బస్సు యాత్ర చేప‌ట్టి ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్ పోరాటం చేయ‌గ‌లిగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో  ఆశించిన స్థానాల‌తో పాటు..పొత్తు పెట్టుకున్న పార్టీకి కూడా , ఆశించిన విధంగా ల‌బ్ధి చేకూర‌డం ఖాయం.
Tags:    

Similar News