పవన్ చూసుకుని టీడీపీ... ?

Update: 2021-10-09 13:38 GMT
పవన్ కళ్యాణ్ యాక్టర్ కమ్ పొలిటీషియన్. ఆయనకు ఉన్న సినిమాటిక్ చరిష్మా గొప్పది. ఇక రాజకీయాల్లో చూసుకుంటే ఆయన ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన వారు. దాంతో ఆయన మీద పందెం కాసే రాజకీయ పార్టీలు చాలానే ఉన్నాయి. లేకపోతే ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు సీట్లు ఓడిపోయిన ఒక నాయకుడు ఇంకా పార్టీని నడపడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఏపీలో చూసుకుంటే జనసేనానికి వైసీపీ అంటే పడదు. అది ఆయన ఎక్కడా దాచుకోలేదు. అందువల్ల శత్రువుకు శత్రువు తమకు మిత్రుడు అని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ అధినాయకత్వం అయితే పవన్ మీద బోలెడు నమ్మకం పెట్టుకుంది. పవన్ తమకు చేదోడు వాదోడుగా ఉంటాడని, కచ్చితంగా ఆయన అండతో తాము వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరవచ్చు అని కూడా ధీమా పడుతోంది.

అయితే పవన్ 2014 నాటి రాజకీయం చేస్తే చంద్రబాబు అయినా ఎవరైనా ఆశలు పెట్టుకోవచ్చు. కానీ ఆయన 2024 నాటికి పార్టీ పెట్టి పదేళ్ళు అవుతుంది. ఆయన కూడా పొలిటికల్ గా బాగా దెబ్బలు తిని కొంత రాటుదేలుతారు కదా. ఇక చంద్రబాబుకు, టీడీపీకి మద్దతు ఇస్తే పవన్ కి ఏమిటి కలసివచ్చేది. అదే టైమ్ లో తన రాజకీయం తాను సొంతంగా చేసుకుంటేనే ఆయనకు కూడా మేలు. ఈ మధ్య పవన్ ఏపీలో టూర్ చేసినపుడు టీడీపీకి గట్టి మద్దతుగా ఉన్న ఒక బలమైన సామాజిక వర్గానికి మద్దతుగా మాట్లాడడం వెనక ఉన్న ఆంతర్యం ఇదేనని అంటున్నారు.

వారు కనుక తమతో వస్తే కొత్త రాజకీయం చూపిస్తాను అన్నట్లుగానే పవన్ మాట్లాడారని విశ్లేషణలు ఉన్నాయి. పవన్ కాపులను పెద్దన్న పాత్ర పోషించమంటూనే మిగిలిన కులాలు కూడా కలసిరావాలని కోరారు. దీని మీదనే టీడీపీలో ఇపుడు చర్చ సాగుతోందిట. పవన్ కనుక గేర్ మార్చి టీడీపీకి ఆయువు పట్టుగా ఉన్న కులాలను దువ్వితే వారు ఆకర్షితులైతే తమ గతేంటి అని కూడా తెలుగు తమ్ముళ్ళు అందోళన చెందుతున్నారుట. అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం జనసేనానికి ఏపీలో ఆదరణ బాగా పెరిగిందని, ఆయన వేసే పంచ్ లకు జనాలు అట్రాక్ట్ అవుతున్నారని, జగన్ని బాగా ఢీ కొడుతున్నారని తెగ సంబరపడుతోంది. అయితే పవన్ బలం పెరిగితే అది టీడీపీకే ఇబ్బంది కదా అన్నదే కొంతమంది తమ్ముళ్ల వాదనగా ఉందిట.

ఎంతసేపూ జనసేన మద్దతు ఇస్తుంది. పవన్ చరిష్మా గట్టిది అనుకుంటూ మురిసిపోతే టీడీపీకి ఇబ్బందే అంటున్నారుట ఆ పార్టీలోని వారు. పేకాట పేకాటే, తమ్ముడు తమ్ముడే అన్నట్లుగా రాజకీయల్లో పొత్తులు ఎత్తులు కూడా ఎపుడూ ఒకేలా ఉండవని అంటున్నారు. అందువల్ల ఒక వేళ పవన్ తమతో కలసిరాకపోతే ఆయన మీద నమ్మకం ఉంచి టీడీపీ ధీమాగా ఉంటే మునిగేది టీడీపీ నావే అని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కి ఏపీలో వైసీపీ సర్కార్ ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా చూస్తోందని, అదే చంద్రబాబు చినబాబు లోకేష్ మీటింగులకు మాత్రం ఇబ్బందులు పెడుతోందని మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన కామెంట్స్ వెనక కూడా అంతరార్ధం ఉందని అంటున్నారు.

వైసీపీ పెద్దలు ఒక వ్యూహం ప్రకారం పవన్ బలాన్ని పెంచితే మాత్రం అది అటు ఇటూ తిరిగి చివరికి టీడీపీకే షాక్ ఇస్తుంది అంటున్నారు. మరి ఎంతో అనుభవం కలిగిన టీడీపీ అధినాయకుడు పవన్ విషయంలో మరీ అతి ధీమాకు పోకుండా సొంత పార్టీని చక్కదిద్దుకుంటేనే రేపటి ఎన్నికల్లో మేలు చేకూరేది అని కూడా సూచనలు వస్తున్నాయట. మొత్తానికి పవన్ కి టీడీపీలో ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వడం పట్ల తమ్ముళ్ళు భిన్న స్వరాలే వినిపిస్తున్నారు అంటున్నారు.




Tags:    

Similar News