పవన్ ట్వీట్ వార్నింగ్.. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకేనా?

Update: 2020-01-13 04:32 GMT
రాజకీయాలన్నాక విమర్శలు.. ఆరోపణలు.. ఘాటు పదాలు వాడేయటం లాంటివి కామనే. కానీ.. ఎక్కడా సభ్యత మిస్ కాకూడదు. వినలేని మాటల్ని.. రాయలేని పదాల్ని బహిరంగంగా.. అది కూడా ప్రెస్ మీట్ లో వాడేయటం ఏ మాత్రం సరికాదు. ఈ విషయంలో ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక మహిళా ప్రజా ప్రతినిధిని పక్కన పెట్టుకొని.. ఊహించ లేని రీతిలో వ్యాఖ్యలు చేసిన ద్వారంపూడి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఎంతలా విరుచుకుపడింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనకూడని మాటల్ని అనేసిన ద్వారంపూడి ఈ ఇష్యూను ఒక సారీతో క్లోజ్ చేయొచ్చు. కానీ.. అందుకు భిన్నంగా తన అధినేతను ఉన్మాది లాంటి పదాలు వాడినప్పుడు.. తాను వాడిన లం.. లాంటి పదాలు పెద్దవి కావంటూ ఆయన సమర్థింపు వివాదాన్ని మరింత పెంచేలా మారింది.

తమ అధినేతను ఉద్దేశించి అధికారపక్ష ఎమ్మెల్యే అంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తారా? అంటూ జనసేన కార్యకర్తలు ద్వారంపూడి ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరటం.. దాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవటంతో కాకినాడలో ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా తమ వారిపై దాడికి పాల్పడ్డారంటూ జనసేన అధినేత ఆరోపిస్తున్నారు.

కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వారిని అదుపులోకి తీసుకోకుండా.. తమ పార్టీకి చెందిన వారిపై కేసులు ఎలా పెడతారంటూ? ప్రశ్నిస్తున్నారు పవన్ కల్యాణ్. అంతేనా.. కాకినాడ పోలీసులకు తాజాగా ట్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు పవన్ కల్యాణ్. అధికార పక్షానికి చెందిన వారిపై కేసులు నమోదు చేయకుండా.. తమ పార్టీ కార్యకర్తల పై కేసులు పెట్టి పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్న మండి పడ్డారు.

ఇలాంటి పరిస్థితే ఉంటే.. తాను ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకే వస్తానని స్పష్టం చేశారు.  కాకినాడకు వచ్చి తేల్చుకుంటానని పవన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ట్వీట్ వార్నింగ్ ఇచ్చిన పవన్ విషయం లో ఏపీ పోలీసులు ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ట్వీట్ లో చెప్పినట్లు పవన్ కానీ కాకినాడకు చేరుకుంటారా? అన్నదిక్వశ్చన్ అయితే.. అదే జరిగితే మాత్రం పోలీసులకు పరీక్షగా మారుతుందనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News