పవన్ వర్సెస్ లోకేష్... జగన్ దారిలోనే...!

Update: 2023-01-08 04:07 GMT
ఏపీలో అతి పెద్ద ఓటు బ్యాంక్ మీద ఒకే సమయంలో విపక్ష పార్టీలు రెండూ గట్టిగా గురి పెట్టాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం  అలాగే మరో పార్టీ జనసేన యూత్ అంటున్నాయి. యువత ఓటు రేపటి తన రాజకీయ భవిత అన్నది బాగానే గ్రహించిన ఈ రెండు పార్టీలు యువతకు చేరువ కావాలని నిర్ణయించుకున్నాయి.

ఇది అచ్చంగా వైసీపీ విపక్షంలో ఉన్నపుడు పలికిన మంత్రమే. జగన్ వాడేసి లబ్ది పొందిన అస్త్రమే. 2019కి ముందు జగన్ యువ భేరీల పేరిట ఏపీ అంతా హోరెత్తించారు. ఆయన విశ్వవిద్యాలయాలు, కాలేజీలకు వెళ్ళి మరీ యూత్ మీటింగ్స్ పెట్టేవారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలు కనుక ఏపీలో అమలు అయితే యువతకు ఉపాధి అవకాశాలు బాగా మెరుగు అవుతాయని. ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుందని  జగన్ గట్టిగా చెప్పేవారు.

దాన్ని యువజనం ఆలోచనలలోకి ఎక్కించేందుకు జగన్ చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. అలా 2019 ఎన్నికల్లో యువత కూడా వైసీపీ వైపు మొగ్గడంతో జగన్ కి అఖండ మెజారిటీ దక్కి సీఎం అయిపోయారు. ఆనాడు యూత్ ని టార్గెట్ చేయడంలో విఫలమైన తెలుగుదేశం సహా ఇతర పక్షాలు ఇపుడు మేలుకొన్నాయి. అందుకే యూత్ తోనే మేము అంటున్నాయి.

ఈ నెల 27 నుంచి లోకేష్ చేపడుతున్న భరీ పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టారు. అంటే డైరెక్తా యువతకు టార్గెట్ చేయడమే. యువత సమస్యలను ప్రస్తావిస్తూ వారిని ఆకట్టుకోవడానికే లోకేషీ పాదయాత్ర చేయబోతున్నారు అని అర్ధమవుతోంది. ఏపీలో యూత్ ఓట్లను కనుక సాలిడ్ గా సమీకరించి సైకిల్ పార్టీకి గుత్తమొత్తంగా తిప్పుకోగలిగితే గెలుపు సాధ్యమని ఆ పార్టీ నమ్ముతోంది. అందుకే లోకేష్ వంటి యువ నాయకుడితో యువగళాన్ని వినిపించబోతున్నారు.

ఇక మరో నేత జనసేన పార్టీ సారధి పవన్ కూడా యువశక్తి పేరిట ఒక భరీ సదస్సుకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 12న ఆయన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఈ సదస్సుని నిర్వహిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రాంతీయ సదస్సు అని పేర్కొనాలి. ఈ సదస్సు ద్వారా యువతను ఆలోచింపచేసి తమకు అనుకూలంగా మార్చుకోవాలని పవన్ చూస్తున్నారు. యువశక్తి ప్రాధాన్యతను కూడా చెప్పబోతున్నారు.

అటు పవన్ కానీ ఇటు లోకేష్ కానీ యువతకు చెప్పేది ఒక్కటే. విభజన హామీలతో సహా ప్రత్యేక హోదా గురించి కూడా వీరు ప్రస్తావించడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం దాన్ని సాధించడంలో విఫలం అయిందని కూడా విమర్శలు సంధిస్తారు. యువతను నిర్వీర్యం చేస్తోందని కూడా ఆరోపిస్తారు. తమకు కనుక అధికారం ఇస్తే విభజన హామీలను కూడా అన్నీ అమలు అయ్యేలా చూస్తామని చెప్పబోతున్నాయి.

ఒక విధంగా చూస్తే టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా జగన్ అస్త్రాన్ని ఆయన మీదకే ప్రయోగించి యూత్ ని టార్గెట్ చేయడం మంచి ఆలోచనే. కానీ యూత్ గతంలో జగన్ని నమ్మారు. పైగా విభజన హామీలు ప్రత్యేక హోదా అంటే అపుడు ఉన్న ఆలోచనలు, యువత దాని మీద పెట్టుకున్న ఆశలు వేరుగా ఉన్నాయి. ఇపుడు కేంద్రంలోని బీజేపీ పూర్తిగా కళ్ళు తెరిపించేసింది. బాబు అయినా జగన్ అయినా ఎవరు వచ్చినా బీజేపీ మాత్రం హామీలు అమలు చేయదని కూడా అర్ధమైపోయింది.

అందుకే కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్  ని సైతం జనాలు నమ్మడం లేదు. ఈ టైం లో యువతకు ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఎక్కుతాయనుకుంటే అది సందేహమే. అయితే యువతకు అర్ధమయ్యేలా చెప్పి ఏపీ అభివృద్ధికి తాము ఏమి చేస్తామో విడమరచి చెబితే మాత్రం ఎంతో కొంత ప్రయోజనం ఉండే చాన్స్ ఉంది అంటున్నారు. మొత్తానికి పవన్ లోకేష్ కూడబలుక్కుని చేస్తున్నారా లేక యాధాలాపంగా యూత్ అజెండాను సెట్ చేసుకున్నారా అన్నది తెలియదు కానీ యువ అస్త్రం మాత్రం జగన్ మీద గట్టిగానే ప్రయోగించడానికి రెడీ అవుతున్నారు.
Tags:    

Similar News