పొత్తులు ఉన్న‌ట్టా? లేన‌ట్టా..? జ‌న‌సేన‌లో అయోమ‌యం!!

Update: 2022-06-06 03:33 GMT
రాజ‌కీయాల్లో త‌ర్జ‌న భ‌ర్జ‌నకు తావుండ‌కూడ‌దు. అదేస‌మ‌యంలో అయోమ‌యానికి అస‌లే ఛాన్స్ ఇవ్వ‌కూడ‌దు. అందునా.. పార్టీ అధినేత‌లే అయోమయంలో చిక్క‌కుంటే.. పార్టీ ప‌రిస్థితి ఏంటి?  నేత‌లు, కార్య‌క‌ర్త‌ల ప‌రిస్థితి ఏంటి?  ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు ప్ర‌శ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఎందుకంటే.. గ‌తంలో ఎన్న‌డూ క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గుర‌వుతున్నారు. పొత్తుల విష‌యంలో ఆయ‌న తీవ్ర అయోమ‌యానికి లోన‌వు తున్నారనే వాద‌న వినిపిస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల కు సంబంధించి జ‌న‌సేన‌లో తీవ్ర త‌ర్జ‌న భ‌ర్జ‌న క‌నిపిస్తోంది. కొంత‌సేపు.. అన్ని పార్టీల‌నూ క‌లుపుకొని వెళ్తాన‌ని చెబుతున్న ప‌వ‌న్‌.. దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహాన్ని అనుస‌రిస్తారో చెప్ప‌డం లేదు. ప్ర‌స్తుతం బీజేపీతో పొత్తుతో ఉన్న ప‌వ‌న్‌.. ఆ పార్టీని ఒప్పించి.. టీడీపీని క‌లుపుకొని వెళ్లాల‌ని భావిస్తున్నారు. అయితే.. బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించే ప్ర‌క్రి య ఎప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిందో కూడా తెలియ‌డం లేదు. గ‌తంలో బీజేపీ, టీడీపీలు క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేశాయి. కానీ, అనివార్య రాజకీయ కార‌ణాల నేప‌థ్యంలో రెండు పార్టీల మ‌ధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.

ఈ నేప‌థ్యంలో బీజేపీ నుంచి టీడీపీ, టీడీపీ నుంచి బీజేపీ రాజ‌కీయంగా దూర‌మ‌య్యాయి. ఇప్ప‌టికీ.. `అప్ప‌టి ప‌రిస్థితి` స‌ర్దుబాటు అయిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. అయినా.. కూడా నేను స‌రిచేస్తాను.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీలిపోకుండా.. కాపాడ‌తాను.. అంటూ.. ప‌వ‌న్ వ్యాఖ్యానిస్తున్నారు. అంటే.. ఆయ‌న దృష్టిలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని అనుకుంటున్న‌ట్టుగా ఉంది. కానీ, ఈ ప‌రిస్థితి ఇప్ప‌టి వ‌ర‌కు ముందుకు సాగ‌లేదు., టీడీపీ ఉత్సాహంగానే ఉన్న‌ప్ప‌టికీ.. బీజేపీ మాత్రం టీడీపీతో క‌లిసి ముందుకు సాగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

పోనీ.. బీజేపీ అధిష్టానాన్ని ప‌వ‌న్ ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారా? అంటే.. ఢిల్లీ వ‌ర్గాల నుంచి ఈ త‌ర‌హా సంకేతాలు రావ‌డం లేదు. పైగా బీజేపీ నాయ‌కులు కూడా భీష్మించుకుని కూర్చున్నారు. త‌మ‌కు ఓటు బ్యాంకు లేక‌పోయినా.. త‌మ కు ప్ర‌జ‌ల్లో బ‌లం లేక‌పోయినా.. టీడీపీతో క‌లిసి ముందుకు సాగుతామ‌న్న సంకేతాలను మాత్రం వారు ఇవ్వ‌డం లేదు. ఇది ఒక‌ర‌కంగా.. జ‌న‌సేన వ్యూహానికి ఇబ్బందిగా మారింది. మ‌రోవైపు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఒంట‌రిగా పోరాడ‌తామ‌ని చెబుతున్నారు. అంతేకాదు, తాము ఎవ‌రికో ప‌ల్ల‌కీ మోయ‌డానికి రాలేద‌ని ప‌వ‌న్ సెల‌విస్తున్నారు.

మ‌రి తామే ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని చెబుతున్న‌ప్పుడు.. ఇక‌, పొత్తుల‌తో ప‌నేంట‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అదేస‌మ‌యంలో నిజంగా నే ఒంట‌రిగా పోటీ చేయాల‌ని అనుకున్న‌ప్పుడు.. క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ విష‌యంపై ప‌వ‌న్ ఎక్క‌డా ఫోక‌స్ చేయ‌డం లేదు. అదేస‌మ‌యంలో పార్టీ స‌భ్య‌త్వంపై పెద‌వి విప్ప‌డం లేదు. రాజ‌కీయ పార్టీల నుంచి వ‌స్తామ ని, వ‌స్తార‌ని.. భావిస్తున్న నేత‌ల‌కు ఆహ్వానాలు ప‌లుకుతున్న ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. ఇక‌, ఎవ‌రికో ప‌ల్ల‌కీ మోయ‌డానికి రాలేద‌న్న‌ప్పుడు.. పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా?  అంటే.. అది కూడా లేదు. ఇవ‌న్నీ చూస్తే.. అస‌లు ప‌వ‌న్ వ్యూహం ఏంటి?  ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా ముందుకు సాగాల‌ని అనుకుంటున్నారు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. మ‌రి దీనికి ప‌వ‌న్ ఎలాంటి స‌మాధానం చెబుతారో చూడాలి.
Tags:    

Similar News