గుర్తుకొస్తున్న రాపాక : టికెట్లు వారికే అంటున్న పవన్...?

Update: 2023-01-16 03:29 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఇన్నేళ్ళలో ఏమి సాధించారు అంటే అనుభవం అని నిస్సందేహంగా చెప్పాలి. ఆయన ఎన్నో చేదు ఫలితాలను చవిచూశారు. మొదట్లోనే ఓటములు ఎదురుకావడంతో ఆయన వాటిని అధిగమించడం ఎలాగో నేర్చుకున్నారు. ఇక 2019 ఎన్నికలు జనసేనానికి ఎన్నో పాఠాలు నేర్పాయి అని అంటున్నారు.

రెండు చోట్ల పోటీ చేస్తే జనాలు ఎటూ నమ్మక ఓడించారు అన్నది బాగా అర్ధం అయిందట. దాంతో 2024లో ఏదో ఒక సేఫెస్ట్ ప్లేస్ చూసుకుని పోటీ చేయడానికే పవన్ సిద్ధపడుతున్నారు అని చెబుతున్నారు. అదే విధంగా 2019లో రాజోలు నుంచి జనసేన తరఫున పోటీ చేసి గెలిచిన రాపాక వరప్రసాదరావు ఆ తరువాత పూర్తిగా అధికార వైసీపీలోకి టర్న్ అయిపోయారు.

పైగా అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కూడా చేశారు. అంటే గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ నుంచి జారిపోయారు అన్న మాట. వర్తమాన రాజకీయాల్లో ఇదే జరుగుతోంది. అధికారంలోకి రావాలి లేదంటే విపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను ఏ రాజకీయ పార్టీ పవర్ లో ఉంటుందో అది చీల్చేస్తుంది. తెలంగాణాలో ఈ ఆట విజయవంతంగా కేసీయార్ సాగిస్తూ వస్తున్నారు. ఏపీలో 2014 నుంచి 2019 టైం లో చంద్రబాబు అదే చేశారు.

ఇక జగన్ కండువాలు కప్పకపోయినా వేరే విధంగా వారంతా ఫ్యాన్ నీడకు చేరేలా చూసుకున్నారు. మరి 2024లో పవన్ అధికారంలో వాటా కోరుకుంటున్నారు. పైగా తానే కీలకం కావాలనుకుంటున్నారు. ఇదంతా జరగాలీ అంటే జనసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండాలి. రేపటి రోజున పొత్తు కుదిరినా మిత్రపక్షం తెలుగుదేశాన్ని కూడా నమ్మలేని పరిస్థితి ఉందన్నది జనసేనకూ తెలియనిది కాదు.

అందుకే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాస్టర్ ప్లాన్ వేశారు అని అంటున్నారు. అదెలా అంటే తనతో పాటు గత కొన్నేళ్ళుగా పార్టీ కోసం కష్టపడుతూ పార్టీయే ఊపిరిగా భావిస్తూ కడు నమ్మకంగా ఉన్న నాయకులకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు అని పవన్ చెప్పబోతున్నారుట. ఆ విధంగా చూస్తే జనసేన అధికారంలో లేనప్పటికీ వెంట ఉన్న వారే నిజమైన సైనికులు అని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారి పోరు అని పవన్ తలపోస్తున్నారుట.

అలా కనుక  చూస్తే నాదెండ్ల మనోహర్ బొలిశెట్టి సత్యనారాయణ, శివశంకర్, సుందరపు విజయకుమార్, మ‌హేశ్‌, కిర‌ణ్‌రాయ‌ల్‌, పసుపులేటి  హ‌రిప్ర‌సాద్ వంటి వారున్నారు. అలాగే మహిళా నేతలు కొందరు ఉన్నారు. వీరందరికీ ఎట్టి పరిస్థితుల్లో టికెట్లు ఇవ్వాలని పవన్ పక్కాగా డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అదే టైం లో జనసేన తెలుగుదేశం పొత్తు కుదిరితే కనుక పెద్ద ఎత్తున తాకిడి మొదలవుతుంది.

ఇతర పార్టీల నుంచే కాదు అర్ధబలం అంగబలం దండీగా ఉన్న బిగ్ షాట్స్ జనసేన టికెట్ల కోసం క్యూ కట్టవచ్చు. అయితే అలాంటి వారి విషయంలో పవన్ ఏమి ఆలోచిస్తారు అన్నదే చూడాలని అంటున్నారు. ఏ రాజకీయ పార్టీకి అయినా అర్ధబలం అంగబలం ముఖ్యం. అలాగే నమ్మకం కూడా ప్రధానం. ఇవన్నీ బ్యాలన్స్ గా ఉండాల్సిన అవసరం ఉంది అంటున్నారు.

మరో వైపు తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి వచ్చే ఫిరాయింపు నేతల విషయంలో పవన్ స్టాండ్ ఏంటో కూడా చూడాలి. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో ఒక బలమైన శాసనసభా పక్షాన్ని తయారు చేసుకుందామని ఆశపడుతున్న పవన్ కళ్యాణ్ నమ్మకస్తులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటేనే వారు తుదికంటా పార్టీతో ఉంటారు అని అంటున్నారు.
Tags:    

Similar News