జనసేనని అలా వదిలేశారా! ఊసెత్తని పువ్వు పార్టీ... !

Update: 2023-06-11 13:30 GMT
ఏపీలో పొత్తులు ఉన్న పార్టీలు రెండే రెండు. బీజేపీ జనసేన. ఈ రెండూ ఆదికి ముందే పొత్తులు పెట్టుకున్నాయి. 2020 జనవరిలో పొత్తులు కుదిరాయి. ఇప్పటికి మూడున్నరేళ్ళు అయింది కలసి నడిచింది లేదు. కలసి పోరాటాలు చేసింది లేదు. బీజేపీకి వైసీపీ అంటే ఇండైరెక్ట్ లవ్వు. జనసేనకు టీడీపీ అంటే తరగని మోజు. ఇలా వేరు దారులో ప్రయాణిస్తున్న ఈ రెండు పార్టీల నేతలు మీడియా ముందు మాత్రం మాది మిత్ర పక్షమే అంటూంటాయి.

నమ్మేదెవరు అన్నది తెలిసినా కూడా పడికట్టు పదాలతో తమ బంధం బహు గొప్పదని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తూంటాయి. బీజేపీకి జాతీయ అధ్యక్షుడు పెద్ద దిక్కు అయిన జేపీ నడ్డా శ్రీ కాళహస్తిలో పార్టీ మీటింగులో సైతం ఏపీలో జనసేన అన్న ఒక మిత్రపక్షం ఉందన్న మాటను మరచారు. ఆయన ఎంతసేపూ వైసీపీని విమర్శించడంతోనే స్పీచ్ లోని పుణ్యకాలం అంతా  గడిపేశారు.

వైసీపీ పాలన అరాచకం అన్నారు. బీజేపీ పాలనను ఏపీలో తీసుకుని రావాలన్నారు. ఏపీలో జనసేన బీజేపీ కాంబోను తేవాలన్న మాట మాత్రం ఆయన నోట రాకపోవడం విశేషం. సోము వీర్రాజు కూడా జగన్ని విమర్శిస్తూ మోడీని పొగుడుతూ స్పీచ్ కానిచ్చేశారు. బీజేపీలో కొత్త పూజారి అయిన కిరణ్ కుమార్ రెడ్డి అయితే  ఏపీలో  ఏకంగా ప్రాంతీయ పార్టీలే దండుగ అనేశారు.

ఏపీలో జనసేన అనబడే ఒక ప్రాంతీయ పార్టీతో బీజేపీకి పొత్తు ఉందన్న సంగతి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుసో తెలియదో కానీ ఆయన మాత్రం బీజేపీనే ఏపీలో అధికారంలోకి తేవాలన్నారు. కాస్తో కూస్తో పొత్తు ధర్మం పాటించిన నేతగా సత్యకుమార్ కనిపించారు. ఆయన వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకున్నారు.

మరి జనసేన విషయంలో బీజేపీ ఇలా ఎందుకు వ్యవహరిస్తోంది. అంతా వ్యూహాత్మకమా లేక మరేదైనా ఉందా అన్నది తెలియడంలేదు. బీజేపీ సొంత పార్టీ సభలు కాబట్టి వారి గురించి చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ రాజకీయాలు ఏపీలోని పరిస్థితుల గురించి మాట్లాడుతున్నపుడు జనసేన అన్న మిత్రపక్షం ఉందన్న సంగతి తమ నోటి ద్వారా జనాలకు తెలియచేయాలి కదా అన్న చర్చ వస్తోంది.

బీజేపీ తో ఉంటూ జనసేన టీడీపీతో పొత్తులకు ప్రయత్నించడమే బీజేపీ పెద్దలకు కోపం తెప్పించింది అని అంటున్నారు. ఏపీలో తమకు జనసేన లెక్క చేయకపోవడం పట్ల కూడా గుర్రుగా ఉన్నారని అంటున్నారు. దేశంలో బీజేపీ పెద్ద పార్టీ అయినా ఏపీలో చాలా చిన్న పార్టీ. ఆ సంగతి జనసేనకు తెలుసు.

కానీ బీజేపీ మాత్రం తామే పెద్దన్న అంటోంది. జనసేన బీజేపీ కూటమిని తామే లీడ్ చేయాలన్న ఆలోచనలు వారికి ఉండబట్టే జనసేన కూడా మెల్లగా పక్కకు తప్పుకుంటోందని అంటున్నారు. జనసేన మీటింగ్స్ లో కూడా బీజేపీ గురించి మాట్లాడడంలేదు, ఇపుడు బీజేపీ కూడా అదే చేస్తోంది. ఇలా రెండు పార్టీలు గందరగోళాన్ని పెంచుతున్నాయా లేక తమ వరకూ తాము పక్కా క్లారిటీతో ఉన్నాయా అన్నది తెలియదు కానీ జనాలకు మాత్రం అర్ధమవుతోంది ఏంటి ఏంటే ఏపీలో ఈ రెండు మిత్రులుగా ధర్మాన్ని అయితే పాటించడంలేదు అని.

బీజేపీ పెద్దలు వచ్చినా తమ మటుకు తాము టూర్లు చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప జనసేనను పిలిచి మాట్లాడడంలేదు, ఏపీలో ఎలా పనిచేయాలన్న దాని మీద యాక్షన్ ప్లాన్ రూపొందించడంలేదు. మొత్తానికి చూస్తే పువ్వు పార్టీ తీరు పట్ల జనసేనలో చర్చ సాగుతోంది.

మరి జనసేనతో ఇలా ఉంటే రేపటి రోజున టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా, పెట్టుకుంటే మూడు పార్టీల మధ్య సఖ్యత ఉంటుందా.2014 నాటి మ్యాజికి 2024లో రిపీట్ అవుతుందా అన్నది అతి పెద్ద చర్చగా ఉంది.

Similar News