అటు బాలయ్య...ఇటు మహేష్... పవన్ స్ట్రాటజీ సూపర్ హిట్

Update: 2023-07-10 08:00 GMT
అత్తారింటికి దారేది అన్న సినిమాలో పవన్ ఒక డైలాగ్ చెబుతాడు. ఎక్కడ నెగ్గాలో తెలియడం కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి అని. ఆ డైలాగ్ ని పవన్ కళ్యాణ్ తనకు తాను బాగా అన్వయించుకున్నారు. అందుకే ఆయన తొలి విడత వారాహి యాత్రలో సినీ హీరోలు అందరూ తనకు ఇష్టమే అన్నారు. టాలీవుడ్ తన ఒక్కడితో సాగడంలేదని అందరు హీరోలతోనే ఉందని అన్నారు. అంతా సినిమాలు చేస్తేనే పరిశ్రమ ఉందని చెప్పారు.

ఇక ప్రభాస్ మహేష్ బాబు తనకంటే పెద్ద హీరోలు అంటూ ఎలాంటి ఇగో లేకుండా పవన్ చెప్పడం విశేషం. వారు పాన్ ఇండియా స్టార్స్ అని ప్రపంచం మొత్తం వారు తెలుసు. తాను మాత్రం తెలుగు కే పరిమితం అని తనను తాను తగ్గించుకున్నారు. ఇక భీమవరంలో అయితే ప్రభాస్ ని పొగిడేశారు. ఇలా పవన్ ఆయా హీరోలను పొగుడుతూ ఫ్యాన్స్ అంతా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

అది బాగా ఫలించింది. పవన్ రెండవ విడత వారాహి యాత్ర ఏలూరులో స్టార్ట్ అయితే ఏలూరు నిండా ఆయా హీరోల ఫ్లెక్సీలు మధ్యలో పవన్ కళ్యాణ్ ని పెట్టి హోరెత్తించారు. అటు బాలయ్య ఇటు మహేష్ బాబు ఫోటోలతో ఏలూరులో పవన్ కి ఆయన హీరోల అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పెట్టి మధ్యాన్ పవన్ ని జనసేనాని గెటప్ లో వేసి మార్పు మొదలైంది అంటూ రాసిన కాప్షన్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.

సినీ హీరోల మద్దతు అంతా ఇపుడు పవన్ కి అన్నట్లుగా ఏలూరు ఫ్లెక్సీలు చాటి చెబుతున్నాయి. పవన్ అన్న ఒకే ఒక్క డైలాగ్ తో ఈ పరిణామం చోటు చేసుకుంది. మొత్తం సినీ పరిశ్రమలోని ఇతర హీరోల ఫ్యాన్స్ ఇపుడు పవన్ కి ఘన స్వాగతం పలకడం అంటే ఇది నిజంగా జనసేనాని చతురతకు నిదర్శనం అని అంటున్నారు.

హీరోల ఫ్యాన్స్ అంతా ఒక్కటిగా ఉండాలని, ఐకమత్యంగా ఉండాలని ఒక టాలీవుడ్ టాప్ హీరో పిలుపు ఇవ్వడమే కాదు, తాను ఆయా హీరోల సినిమాలు చూస్తాను వారు తనకూ ఇష్టమే అని చెప్పడం ద్వారా ఆల్ హీరోస్ ఫ్యాన్స్ ని పవన్ ఆకట్టుకున్నారు అని అంటున్నారు. ఇప్పటిదాకా పవన్ ఫ్యాన్స్ మాత్రమే ఆయన సభలలో హోరు చేసేవారు.

వారే జెండాలు కట్టి హడావుడి చేసేవారు, ఇపుడు బాలయ్య మహేష్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా పవన్ కి వెల్ కం చెప్పడం ఏపీ రాజకీయాల్లోనే కాదు సినీ ప్రపంచానికి కూడా కొత్త అనుభవంగా ఉందని అంటున్నారు. పవన్ అలా తాను నెగ్గడం ఏంటో ఆచరణలో చూపించారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ మార్క్ స్ట్రాటజీ ఫుల్ గా వర్కౌట్ అయింది. ఈ పరిణామం ప్రత్యర్ధి పార్టీలను కలవరపెట్టేలా ఉంది అని అంటున్నారు.

Similar News