జ‌ర‌భ‌ద్రం.. ఎమ్మెల్యే ద్వారం పూడి వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ ట్వీట్లు

Update: 2022-06-09 03:52 GMT
జ‌న‌సేనాని పవన్ కల్యాణ్‌పై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శల దాడికి దిగే కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్‌ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ పవన్‌కు అనుకూల వ్యాఖ్యలు చేశారు. జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేసి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే కాపులు పవన్‌కే ఓట్లేస్తారని, కాపులతో ఎంత సన్నిహిత సంబంధాలున్నా నాకు కూడా ఓటేయరని ద్వారంపూడి వ్యాఖ్యానించడం కొసమెరుపు.

ఈ వ్యాఖ్యలు కొందరు జన సైనికుల్లో జోష్ నింపాయి. పవన్ సత్తా ఏంటో వైసీపీ ఎమ్మెల్యేకు కూడా తెలిసిందని ట్విట్టర్‌లో ద్వారంపూడి వీడియోను వైరల్ చేశారు. ఆ వీడియో జనసేన అధిష్టానం దృష్టికి వెళ్లడంతో పవన్ ఈ ‘జర భద్రం’ అంటూ ట్వీట్స్ చేశారు.

``అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే.``

``అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి`` అని ప‌వ‌న్ వ‌రుస ట్వీట్లు చేశారు.

ద్వారంపూడి స్ట‌యిలే వేరు!

కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి స్ట‌యిలే వేరు. గతంలో పవన్ కల్యాణ్‌ పేరెత్తితే చాలు తిట్ల దండకంతో పూనకం వచ్చినట్లు అయిపోయేవారు. ఎడాపెడా విమర్శలతో దాడి చేసేవారు. గడిచిన రెండున్నరేళ్లుగా పవన్‌కళ్యాణ్‌ను ద్వారంపూడి నిందించినంతగా వైసీపీలో మరో నేత ఎవరూ విమర్శలు చేయలేదు. ఒక రకంగా జగన్ మెప్పు కోసం పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై ఎన్నో మాటలు తూలనాడారు.

ఎమ్మెల్యే ద్వారంపూడి తిట్ల దండకం నేరుగా పవన్‌ను తాకింది. దీంతో పవన్‌ కూడా పలుసార్లు- "తేల్చుకుందాం.. సిద్ధంగా ఉండండి.." అన్న రేంజ్‌లో పలు బహిరంగ సభల్లో హెచ్చరిక సంకేతాలు ఇచ్చి హీట్ పెంచారు. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గంలో స్వయంగా పవన్‌ కల్యాణే బరిలో నిలవబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే ద్వారంపూడిని రాజకీయంగా అడ్రస్‌ లేకుండా చేసేలా పవన్ ఈ నియోజకవర్గంలో పోటీచేసి, వారికి చెక్‌ పెట్టేందుకు పావులు కదుపుతున్నారని జనసేన వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News