మరాఠా రాజకీయాల్లో అజిత్ పవార్.. పొలిటికల్ కట్టప్ప

Update: 2019-11-23 05:20 GMT
కమలనాథులకు కట్టుబానిస కాదు. కానీ.. అధికారానికి దాసుడు. పేరులో పవర్ ఉన్నా.. కీలక పదవులు దక్కని వేళ.. అధికారం కోసం దేనికైనా సిద్ధమని ప్రూవ్ చేశాడు ఎన్సీపీ నేత అజిత్ పవార్. అధినేత శరద్ పవార్ కు షాకిస్తూ.. ఈ అభినవ రాజకీయ కట్టప్ప చర్య ఇప్పుడు అందరిని విస్తుపోయేలా చేస్తోంది. పొలిటికల్ కట్టప్ప ముందు రీల్ కట్టప్ప చిన్నపోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

ఓపక్క గంటల కొద్దీ మంతనాలు జరపుతూ.. నమ్మకంగా గుట్టుమట్లు అన్ని తెలుసుకుంటూ.. చివరకూ ఊహించని రీతిలో ట్విస్ట్ ఇచ్చి పవర్ ను సొంతం చేసుకున్న అజిత్ పవార్ చర్యతో అవాక్కు అవుతున్నారు. ఆ మహాశయుడు రాత్రి చర్చల్లో కూడా ఉన్నారంటూ శివసేన నేతలు ఘెల్లుమంటున్నారు. రాత్రి పొద్దుపోయే వరకూ పార్టీ అధినేత శరద్ పవార్ చెంతనే ఉండి.. అన్ని విషయాల్ని గమనిస్తూ.. బీజేపీ అధినాయకత్వంతో టచ్ లో ఉన్న ఆయన.. తెల్లారేసరికి ప్లేట్ తిప్పేశారు. అధినేతకే వెన్నుపోటు పొడిచారు.

రాత్రి పార్టీ సమావేశాల్లో కీలకభూమిక పోషిస్తూ.. తెల్లారేసరికి రాజ్ భవన్ లో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్ కు మించిన కట్టప్ప మరొకరు ఉండరని అభిప్రాయపడుతున్నారు. ఆయన తీరును సొంత పార్టీకి చెందిన వారు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.

బానిసగా ఉంటూ.. రాజు స్థానంలో ఉన్న వారి ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటించే రాజమౌళి కట్టప్ప ఇచ్చే ట్విస్టుకు మించిన తీరును ప్రదర్శించటంలో అజిత్ పవార్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. రీల్లో మాత్రమే సాధ్యమయ్యే ట్విస్టును రియల్ గా చూపించటంలో ఇతనికి మించినోళ్లు మరొకరు ఉండరనే విషయాన్ని ఫ్రూవ్ చేశారు.తాను పార్టీ అధినేతకు విధేయుడిగా ఉండే కన్నా.. పవర్ కు విధేయుడినన్న విషయాన్ని అజిత్ నిరూపించారు. ఇప్పటివరకూ రీల్ కట్టప్ప మాత్రమే తెలిసిన ప్రజలకు.. మహారాష్ట్రలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు చూసినోళ్లకు మాత్రం పొలిటికల్ కట్టప్ప ఎలా ఉంటాడో కళ్లకు కట్టిన పరిస్థితి.

Tags:    

Similar News