పవార్ - పీకే భేటీ.. ఆ పదవి కోసమా? పులిహోర కబుర్లు కాకుంటే మరేంటి?

Update: 2021-06-13 10:30 GMT
వినేటోడు ఉంటే చెప్పేటోడు చెలరేగిపోతాడని ఊరికే అనరు. ఇప్పుడు వినిపిస్తున్న విశ్లేషణలు వింటే పిల్లాడు సైతం ప్రశ్నించేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గాలి వార్తల్ని చూసి స్ఫూర్తి పొందారేమో కానీ.. రాజకీయ వర్గాల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించిన ఎన్సీపీ అధినేత పవార్ - ప్రశాంత్ కిషోర్ భేటీకి సంబంధించి జాతీయ మీడియా వండిన పులిహోర కథనం ఇప్పుడు వైరల్ అవుతోంది.

లాజిక్ మిస్ అయిన ఈ కథనం కామెడీగా మారింది. బుర్రలో ఏ మాత్రం తర్కం అనే గుజ్జు కాస్త ఉన్నా కూడా ఈ స్టోరీని చూసిన కామెడీ చేసుకోవటం ఖాయం. కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీని కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే.. తాను కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తానంటూ పీకే పేర్కొనటం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో స్నేహ సంబంధం ఉన్న శరద్ పవార్.. తాజాగా పీకేతో భేటీ కావటంతో బోలెడన్ని వాదనలు.. విశ్లేషణలు తెర మీదకు వచ్చాయి.

మహారాష్ట్రంలో శివసేన.. ఎన్సీపీ.. కాంగ్రెస్ ఉమ్మడి భాగస్వామ్యంతో ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో పవార్ తో పీకే భేటీ ఆసక్తికరంగానే కాదు..కాంగ్రెస్ పార్టీకి పీకేకు మధ్య పవార్ ను అనుసంధానకర్తగా పలువురు భావించారు. ఇదిలా ఉంటే.. రోజు గడిచేసరికి ఈ భేటీకి సంబంధించి మీడియాలో వస్తున్న కథనాల్ని చూస్తే.. నవ్వాలో.. ఏడవాలో అర్థం కాని పరిస్థితి.

ఎందుకంటే పవార్ తో పీకే భేటీ జరిగింది.. ఆయన్ను రాష్ట్రపతిని చేయటానికట. అంతేకాదు.. పవార్ మాష్టారు ఓకే చెబితే.. దేశంలోని మోడీ వ్యతిరేక గ్రూపుల్ని ఒక జట్టు మీదకు తెస్తానని చెప్పినట్లుగా కథనాలు వచ్చాయి. వీటిని చూసి ఏడవాలో నవ్వాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే.. కేంద్రంలో బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉంది. ఆ పార్టీతో సంబంధం లేని కొందరు.. మోడీకి మద్దతుగా నిలిచేవారే. అలాంటప్పుడు దేశంలోని మోడీ వ్యతిరేకుల్ని ఒక జట్టుగా చేసినా వారికి ఉన్న ఓట్లు మొత్తం కలిపినా కూడా పవార్ ను రాష్ట్రపతిని చేయటం సాధ్యమయ్యే పని కాదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీతో పెట్టుకోవటానికి ఎవరూ సిద్ధంగా లేరు.అందునా.. ఓడిపోయే అభ్యర్థిగా తాను బరిలోకి దిగటానికి పవార్ లాంటి వారు అస్సలు ఇష్టపడరు. అంతేకాదు.. వర్కువుట్ కాని విషయాల మీద వర్కు చేయటం పీకే లాంటోళ్లకు అస్సలు ఇష్టం ఉండదు. మొత్తానికి బయటకు రాని అంశం మీద పవార్ - పీకే భేటీ జరిగింది. దాన్ని కవర్ చేయటానికి సంబంధం లేని పులిహోర కథనాన్ని తెర మీదకు తీసుకొచ్చి సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం జరుగుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News