మోదీ వ‌ల‌లో ఎలా చిక్కుకోలేదో చెప్పిన ప‌వార్

Update: 2019-12-03 04:47 GMT
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో అనేక నాటకీయ పరిణామాల చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ రాష్ట్రంలో బీజేపీ-శివ‌సేన ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచ‌నాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ...నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిక నేత అజిత్ ప‌వార్‌తో క‌లిసి క‌మ‌ల‌నాథులు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఈ డ్రామా జ‌రిగే స‌మ‌యంలోనే...గత నెలలో ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్‌ పవార్ కలుసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పడటం, అంత‌కుముందు ఈ ఇద్ద‌రు ప్ర‌ముఖుల భేటీ...అనంత‌రం తిరిగి ఎన్‌సీపీ-శివ‌సేన కూట‌మి అధికారంలోకి రావ‌డం...ఉత్కంఠ‌ను రేకెత్తించాయి. ఈ ప‌రిణామాల‌న్నింటిపై తాజాగా శ‌ర‌ద్ ప‌వార్ స్పందించారు.

ఓ మరాఠా టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ పవార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ తనతో కలిసి పని చేద్దాం అని ప్రతిపాదించారని, కానీ తాను అందుకు తిరస్కరించానని శరద్ పవార్ తెలిపారు. కలిసి పని చేయడం సాధ్యం కాదని మోదీకి స్పష్టం చేసినట్లు వివ‌రించారు. ``మా స‌మావేశంలో మోదీ కలసి పని చేద్దామని నాతో ప్రతిపాదించారు. కానీ, నేను మన వ్యక్తిగత సంబంధాలు చాలా బాగున్నాయి అలాగే కొనసాగుతాయి. కానీ కలిసి పని చేయడం మాత్రం సాధ్యం కాదు అని చెప్పాను`` అంటూ ఎన్‌సీపీ అధినేత త‌మ స‌మ‌వేశం గురించి తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మ‌రో రెండు రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల గురించి కూడా శ‌ర‌ద్ ప‌వార్ వివ‌రించారు. తనను రాష్ట్రపతిని చేస్తామని ప్ర‌ధాని మోదీ సర్కార్ భావించినట్లు వచ్చిన వార్తలను పవార్ తోసిపుచ్చారు. కానీ తన కూతురు సుప్రియా సూలేను మోదీ క్యాబినెట్‌లో చేర్చుకునేందుకు ప్రతిపాదన వచ్చిందని చెప్పారు. అకస్మాత్‌గా ఫడ్నవీస్‌కు మద్దతు తెలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ తిరుగుబాటును అణిచేస్తానని, తనను విశ్వసించాలని ఉద్ధవ్ ఠాక్రేను కోరినట్లు శరద్ పవార్ తెలిపారు. మెజారిటీ ఎన్సీపీ నేతలు తనపై విశ్వాసం ప్రదర్శించడం వల్లే తాను విజయవంతమయ్యానని పవార్ పేర్కొన్నారు. ``ఫడ్నవీస్‌కు మద్దతు ఇచ్చిన విష‌యంలో చేసింది క్షమించరాని తప్పిదం అని నేను అజిత్‌కు చెప్పాను. ఎవరు చేసినా పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. అందుకు నువ్వు మినహాయింపు కాదు అని తేల్చి చెప్పాను ` అంటూ ఆ నాట‌కీయ ప‌రిణామాల గురించి
తెలిపారు.
Tags:    

Similar News