పేటీఎం అత్యుత్సాహం చుక్కలు చూపించింది

Update: 2016-11-14 16:59 GMT
దేశీయంగా అతిపెద్ద ఆన్ లైన్ లావాదేవీ యాప్ లో ఒకటిగా నిలుస్తున్న పేటీఎం త‌న అత్యుత్సాహంతో చిక్కుల్లో ప‌డింది. నోట్ల ర‌ద్దుతో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున క్యూలైన్‌ ల‌లో నిలిచి ఉండి త‌మ కార్య‌క‌లాపాలు పూర్తిచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో ప‌లువురు పేటీఎం ద్వారా త‌మ అవ‌సరాలు తీర్చుకుంటున్నారు. అయితే నోట్ల ర‌ద్దు-త‌ద‌నంత‌ర‌ ప‌రిణామాల‌పై స్పందిస్తూ పేటీఎం తాజాగా రూపొందించిన యాడ్ వివాదంగా మారింది. '' డ్రామా బంద్ కరో.. పేటీఎం కరో'' అనే ట్యాగ్ లైన్ తో రూపొందించిన పేటీఎం యాడ్ ర‌చ్చ ర‌చ్చ‌గా మార‌గా పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సి వ‌చ్చింది.

పెద్ద నోట్ల ర‌ద్దుతో సామాన్యులు అవ‌స్థ‌లు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో పేటీఎం ద్వారా లావాదేవీలు పూర్తిచేసుకోవాల‌నే ఉద్దేశంతో మ్యాక్ కాన్ ఢిల్లీ ఏజెన్సీతో క‌లిసి కొత్త యాడ్ రూపొందించింది. ఇందులో భాగంగా '' డ్రామా బంద్ కరో.. పేటీఎం కరో'' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అయితే ఇక్క‌డే సీన్ రివ‌ర్స్ అయింది. సామాన్యులను తీవ్రంగా బాధించే రీతిలో ఈ ట్యాగ్‌ లైన్ ఉండ‌టంతో ప‌లువురు ట్విట్ట‌ర్‌ లో విమ‌ర్శ‌లు గుప్పించారు. నోట్ల ర‌ద్దు, స‌రిప‌డా కొత్త క‌రెన్సీ లేక‌పోవ‌డంతో తాము ఇబ్బందులు ప‌డుతుంటే సెటైర్లు వేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. గృహావసరాల కోసం కొనుగోళ్లు, ప్ర‌యాణాలు, ఇత‌ర‌త్రా ప‌నుల విష‌యంలో సామాన్యులు చుక్క‌లు చూస్తుంటే వారి బాధలు పేటీఎం యాజ‌మాన్యానికి డ్రామాగా క‌నిపిస్తోందా? అని మండిప‌డ్డారు. అంతేకాకుండా ప‌లువురే తాము యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో పేటీఎం యాజ‌మాన్యం దిగివ‌చ్చింది.  పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ ఆ యాడ్ పై ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఆ యాడ్ ను మార్చ‌నున్న‌ట్లు  ప్రకటించారు.  ఇదిలాఉండ‌గా నోట్ల ర‌ద్దుతో క‌రెన్సీ చెలామ‌ణిలో లేక‌పోవ‌డం వ‌ల్ల పేటీఎంను ఉప‌యోగించే వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది. సాధార‌ణంగా పేటీఎం ద్వారా లావాదేవీలు చేసేవారి సంఖ్య రోజుకు 30 ల‌క్ష‌లు ఉంటుండ‌గా ప్ర‌స‌తుతం ఆ సంఖ్య 50ల‌క్ష‌ల‌కు చేరింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News