బొత్స డిమాండ్‌ కు టీడీపీ ఘాటు రిప్లై

Update: 2016-07-23 04:43 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజధాని అమరావతితో పాటు జిల్లా కేంద్రాల్లో రాజకీయ పార్టీలకు ప్రభుత్వ భూములను ఇవ్వాలన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వైకాపా తీవ్రంగా వ్యతిరేకించింది. వెంటనే ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో రాజకీయ పార్టీలకు సీట్లను బట్టి భూములు - స్ధలాన్ని కేటాయించాలన్న ప్రభుత్వం నిర్ణయం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రజలు రాజకీయ పార్టీలను ఎన్నుకునేది అభివృద్ధి - సంక్షేమం కోసమని ఆయన అన్నారు.

టీడీపీ ప్రభుత్వం ప్ర‌జా సంక్షేమాన్ని మర్చిపోయి అసెంబ్లీ సీట్లను బట్టి స్ధలాలను కేటాయిస్తామని చట్టానికి సవరణలు చేయాలనుకుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఏపిఐఐసి వద్ద 3 లక్షల భూమి ఉందని పరిశ్రమలు వచ్చేస్తున్నాయని ప్రభుత్వం ప్రకటిస్తోందని అంతేకాకుండా మరో 7 లక్షల భూములను సేకరిస్తున్నట్లు కూడా చంద్రబాబు అంటున్నారని ఆయన వివ‌రించారు.  ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యం పార్టీలకు - తనకు కావాల్సిన పరిశ్రమలకు కేటాయించేందుకు ప్రజలు అధికారం ఇచ్చారా అని బొత్స ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చౌకగా భూములను కొట్టేయాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను సాగనివ్వమని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు మచిలీపట్నం పోర్టుకు ఐదు వేల ఎకరాలు చాలని చెప్పారన్నారు. ఇప్పుడు లక్ష ఎకరాలు ఎందుకని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో బడుగు - మధ్యతరగతి వర్గాలు - పేదలకు గృహాలు నిర్మించేందుకు వినూత్న పథకాలు అమలు చేయకుండా రాజకీయ పార్టీలకు భూముల పందేరం చేసే పిచ్చి ఆలోచనలు మానుకోవాలని బొత్స‌ కోరారు.

బొత్స వ్యాఖ్య‌ల‌పై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు. నమోదైన రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపుపై వైసీపీ నేత జగన్‌ అనవసర రాద్ధాంతం చేయిస్తున్నారని  విమర్శించారు.ఈ నిర్ణ‌యం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ కోసమో - వ్యక్తుల కోసమో కాదని రాజకీయ పార్టీలకు మాత్రమేనని పయ్యావుల తెలిపారు. ఈ కేటాయింపులు కూడా 33 సంవత్సరాల లీజు పద్ధతిలోనేనన్నారు. ఇది ఏపీ ప్రభుత్వం కొత్తగా పెట్టింది కాదని..కేంద్ర ప్రభుత్వం సహా ఢిల్లీ - హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలకు భూకేటాయింపుల కోసం ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయన్నారు. కేటాయించిన భూమి లో ఏడాదిలోగా భవన నిర్మాణాలు చేపట్టకపోతే సంబంధిత జిల్లా కలెక్టరే దాన్ని స్వాధీనం చేసుకుంటారని ప‌య్యావుల‌ తెలిపారు.
Tags:    

Similar News