అమరావతి భూములు తిరిగి రైతులకు..

Update: 2019-12-20 06:30 GMT
ఏపీ కేబినెట్ లోనే సీనియర్ మంత్రి అయిన పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో చంద్రబాబు రైతులనుంచి  తీసుకున్న భూములను వెనక్కి ఇచ్చేస్తామని మంత్రి పెద్ది రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం  ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చారని.. అన్నమాట ప్రకారం రైతుల నుంచి తీసుకున్న 33వేల ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు.

ఇక  అమరావతిని చంద్రబాబు తాత్కాలిక రాజధాని మాత్రమే అన్నారని.. తాము కూడా తాత్కాలిక రాజధానిగానే భావిస్తున్నామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. మూడు రాజధానులు కాకుంటే ఏకంగా 30 రాజధానులు పెట్టుకుంటామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి 300 ఎకరాలు సరిపోతాయని వేల ఎకరాలు ఎందుకంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ సచివాలయం, అసెంబ్లీ ఎన్ని ఎకరాల్లో ఉందని ప్రశ్నించారు. రాజధానులకు కేంద్రం అనుమతులు, నిధులు అవసరం లేదని పెద్ది రెడ్డి స్పష్టం చేశారు.
 
ఇక అమరావతిలో ఆందోళనలపై పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. లొల్లి చేసే వాళ్లంతా టీడీపీ కార్యకర్తలేనని అన్నారు. విశాఖలో వైసీపీ నేతలు భూములు కొన్నారన్నది అవాస్తవమన్నారు. తూళ్లురులో టీడీపీ నేతలే తక్కువ ధరకు భూములు కాజేశారని ధ్వజమెత్తారు. ఇక ఈ మార్చిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని పెద్దిరెడ్డి తెలిపారు.
    

Tags:    

Similar News