పెద్దిరెడ్డి క్వ‌శ్చ‌న్‌!...ఫిరాయింపుల‌పై చ‌ర్య‌లేవి?

Update: 2017-10-24 04:32 GMT
ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు తెర‌లేచింది. న‌వంబ‌రులో 10 రోజుల పాటు స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈమేర‌కు అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కూడా సోమ‌వారం ప్ర‌క‌టించారు. దీంతో ఏకైక విప‌క్షం వైసీపీ త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టింది. ప్ర‌తి అసెంబ్లీ స‌మావేశాల్లోనూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెడుతున్న వైసీపీ ఈ ద‌ఫా కూడా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌తోపాటు.. టీడీపీ అధినేత‌ - సీఎం చంద్ర‌బాబును క‌డిగేసేందుకు అన్ని అస్ర్తాల‌ను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా వైసీపీ నుంచి పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించి దాదాపు 20 మందిని త‌న జ‌ట్టులో క‌లిపేసుకున్న బాబును స‌భ‌లో నిల‌దీయాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే అసెంబ్లీ వ్యూహ‌ర‌చ‌న‌ను వైసీపీ నేత‌లు సిద్ధం చేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ‘‘సభ ప్రారంభతేది నాటికి ఆ 20 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుచేసి - నలుగురు మంత్రులను బర్తరఫ్‌ చేసి - శాసనసభ సంప్రదాయాల ప్రకారం ప్రతిపక్షానికి ప్రజా సమస్యలమీద మాట్లాడేందుకు అవకాశం కల్పించాలి’ అని ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా అసెంబ్లీ స‌మావేశాల‌పై అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు పార్టీ అధ్య‌క్షుడు వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన హైద‌రాబాద్ లోట‌స్‌ పాండ్‌ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ముఖ్య నేతలు  భేటీ అయి అసెంబ్లీ స‌మావేశాల్లో చ‌ర్చించాల్సిన అంశాల‌పై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. స‌మావేశం వివరాలను ఆ పార్టీ శాసనసభ ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ సమస్యలు - రుణమాఫీ - చంద్రబాబు విదేశీ పర్యటనలు - మెడికల్‌ సీట్లలో మైనారిటీలకు అన్యాయం - అసెంబ్లీ సమావేశాలు - పాదయాత్ర తదితర అంశాలపై నాయకులతో అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చర్చించారని పెద్దిరెడ్డి తెలిపారు. అసెంబ్లీని ఆగస్టులోనే నిర్వహించాల్సి ఉండగా, అలా చేయకుండా - పాదయాత్ర ప్రారంభసమయంలో నిర్వహిస్తుండటం అధికార తెలుగుదేశం పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని సమావేశంలో నేతలు వ్యాఖ్యానించినట్లు చెప్పారు.

 ప్రజా సమస్యలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడనియ్యకుండా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నదని, అలాంటి నేపథ్యంలో అసలు సభకు హాజరుకాకపోవడమే సరైన నిర్ణయమని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డట్లు పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అయితే, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేదీ లేనిది పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగనే నిర్ణయిస్తారని, ఈ అంశంపై అక్టోబర్‌ 26న జరగనున్న ఎల్పీ సమావేశంలో మరోసారి చర్చించి - అధ్యక్షుడు తుది ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. అయితే, జ‌గ‌న్ ఈ ప్ర‌క‌ట‌న‌పై వెంట‌నే స్పందించిన‌ట్టు త‌ర్వాత వార్త‌లు వ‌చ్చాయి. తాను పాద‌యాత్ర‌లో ఉన్న‌ప్ప‌టికీ పార్టీ ఎమ్మెల్యేలంద‌రూ స‌భ‌కు హాజ‌రు కావాల్సిందేన‌ని ఆదేశించిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి వైసీపీ అజెండా పై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News