శ్రీకాళహస్తి ఘటనకు ఆ మంత్రి అనుచరులే కారణమా?

Update: 2022-10-26 10:30 GMT
అక్టోబర్‌ 25న సూర్యగ్రహణం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన దేవాలయాలన్నీ మూతపడ్డ సంగతి తెలిసిందే. అయితే శ్రీకాళహస్తిలో ఆలయం మాత్రం భక్తుల తాకిడితో కిటకిటలాడిపోయింది. సూర్య గ్రహణం నేపథ్యంలో రాహుకేతు నివారణ పూజలు చేయించడానికి భక్తులు ఎగ్గబడ్డారు.

ఈ నేపథ్యంలో భక్తుల మధ్య తోపులాట, గొడవ చోటు చేసుకున్నాయి. మరోవైపు వీఐపీలు ఎగబడటంతో ఆలయ నిర్వాహకులు భక్తులను ఆపేసి వారికే పెద్దపీట వేశారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు ఆలయానికి వచ్చారు.

భక్తులను పట్టించుకోకుండా వైసీపీ నేతలకే ఆలయ అధికారులు వైసీపీ నేతలకే పెద్దపీట వేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు భక్తులను చితకబాదారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సతీమణి.. కొడుకులు, కోడళ్లు.. మనవలు, ఇతర బంధువులతో ఆలయానికి వచ్చారని అంటున్నారు.
దీంతో ఆయనకు ఆలయ అధికారులు సహా.. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి స్వాగతం పలికారు. ఇందులో తప్పుబట్టడానికి ఏమీ లేకపోయినా భారీ సంఖ్యలో వచ్చిన పెద్దిరెడ్డి అనుచరులు క్యూలైన్లలో చేరి భక్తులను ఇబ్బంది పెట్టారని అంటున్నారు.  

మంత్రి కుటుంబీకులను అమ్మవారి అభిషేకానికి తీసుకెళ్లేందుకు వైసీపీ నేతలు నానా బీభత్సం సృష్టించారని మండిపడుతున్నారు. భక్తులను పక్కకు నెట్టేసి తోపులాటకు దిగారని భక్తులు ఆరోపించారు. ఈ క్రమంలో కొందరు భక్తులు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులపై తిరగబడటంతో వివాదం ఇంకా పెద్దదైందని చెబుతున్నారు.

వైసీపీ నేతలు, పోలీసులు కలిసి భక్తులను తోసేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సామాన్య భక్తులు మంత్రి అనుచరుల తీరుతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని అంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబీకులు, ఇతర వీఐపీల అభిషేకం పూర్తయ్యే వరకు సామాన్య భక్తులు నానా కష్టాలు పడ్డారని పేర్కొంటున్నారు.

కాగా భక్తులపై దాడి వెనుక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అనుచరులు ఉన్నారని చెబుతున్నారు. మధుసూదన్‌రెడ్డికి పెద్దిరెడ్డి శిష్యుడిగా పేరుంది. దీంతో తన గురువు దర్శనానికి ఏర్పాట్లు చేసే క్రమంలో భక్తులను నానా ఇబ్బందులు పెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News