స‌ర్కారు మ‌రో `పంచాయ‌తీ`.. పెద్దిరెడ్డి వ్యాఖ్య‌ల క‌ల‌క‌లం

Update: 2021-01-28 03:10 GMT
రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గడ్డ ర‌మేష్ కుమార్‌తో ప్ర‌భుత్వం త‌న వివాదాన్ని వ‌దిలి పెట్ట‌డం లేదు. అవ‌స‌రం ఉన్నా.. లేకున్నా.. క‌మిష‌న‌ర్‌తో వివాదానికి సై! అంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేది లేద‌ని చెప్పిన ప్ర‌భుత్వం ఈ క్ర‌మంలో నిమ్మ‌గ‌డ్డ‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. చంద్ర‌బాబుకు అనుకూలంగా నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హ‌రిస్తున్నారని, ప్ర‌జారోగ్యం ప‌ట్ల ఆయ‌న‌కు శ్ర‌ద్ధ లేద‌ని ఇలా తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. అయితే.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైనా.. నిమ్మ‌గ‌డ్డ‌పై మాత్రం అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతూనే ఉంది. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి నిమ్మ‌గ‌డ్డ కేంద్రంగా మ‌రోసారి విమ‌ర్శ‌లుగుప్పించారు. ఆయ‌న ను మ‌ళ్లీ చంద్ర‌బాబు మ‌నిషి .. అంటూ వ్యాఖ్యానించారు. పైగా.. ఆయ‌న తాజాగా ఇద్ద‌రు కీల‌క అధికారుల‌పై ఇచ్చిన అభిశంస‌న ఉత్త‌ర్వుల‌ను వెన‌క్కి పంపేస్తామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

విష‌యంలోకి వెళ్తే.. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఈ నెల 8న క‌మిష‌న‌ర్ నిమ్మ‌డ‌గ్గ షెడ్యూల్ ఇచ్చారు. త‌ర్వాత నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఈ క్ర‌మంలోనే పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు కీల‌క‌మైన అధికారులుగా ఉన్న రాష్ట్ర పంచాయ‌తీ రాజ్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి గోపాల‌కృష్న ద్వివేది, క‌మిష‌న‌ర్ గిరిజా శంక‌ర్‌ల‌ను ఆయా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. ముఖ్యంగా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి.. ఎన్నిక‌ల‌పై వివ‌రించాల‌ని ఆదేశించారు. ఇక‌, దీనికి ముందు ఓట‌ర్ల జాబితాను తాజాది ప్ర‌క‌టించాల‌ని కూడా నిమ్మ‌గ‌డ్డ సూచించారు. అయితే.. వారు ఈ ప‌నిచేయ‌కుండా.. ప్ర‌భుత్వం క‌నుస‌న్న‌ల్లో ఎన్నిక‌ల‌కు వెళ్లేది లేదంటూ.. భీష్మించారు. ఇది అధికారుల‌కు-క‌మిష‌న‌ర్‌కు మ‌ధ్య వివాదానికి కార‌ణ‌మైంది.

ఈ నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రు అధికారులు త‌మ విధుల ప‌ట్ల నిర్లక్ష్యం వహించారంటూ వారిని అభిశంసిస్తూ నిమ్మగడ్డ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే... ఈ అభిశంసన పత్రాన్ని తాము ఆయనకు తిప్పి పంపాలని నిర్ణయించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన పెద్దిరెడ్డి... ఎస్ఈసీ నిమ్మగడ్డపై విమ‌ర్శ‌లు చేశారు. నిమ్మగడ్డ పదవీకాలం మార్చి 31 వరకేనని, ఆ తర్వాత కూడా తమ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. ఇప్పటివరకైతే గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ ఇద్దరూ కూడా తమ పదవుల్లో కొనసాగుతున్నారని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి (నిమ్మగడ్డ) ఎన్నికల సంఘానికి ఉన్న విచక్షణ అధికారాలను అడ్డంపెట్టుకుని వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని ఇద్దరు సీనియర్ అధికారులపై కక్షపూరితంగా చర్యలు తీసుకోవడం వెనుక నేపథ్యం ఏంటో అందరికీ తెలిసిందేనని పెద్దిరెడ్డి అన్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో ద్వివేది రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా పనిచేశారని, అలాంటి వ్యక్తిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చర్యలు తీసుకోవడాన్ని ఎవరు ఆహ్వానిస్తారు? అంటూ పెద్దిరెడ్డి ప్రశ్నించారు. మొత్తంగా ఈ వ్యాఖ్య‌లు మ‌ళ్లీ.. క‌మిష‌న‌ర్‌కు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య అగాథం పెంచుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. తాజాగా నిమ్మ‌గ‌డ్డ నిర్వ‌హించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించ‌క‌పోయినా.. ప్ర‌భుత్వం పెద్ద‌లు.. జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని హెచ్చ‌రించారు. దీనిని బ‌ట్టి మున్ముందు మ‌ళ్లీ వివాదం ర‌గులుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News