పెద్దిరెడ్డి సంచలనం..ఏ క్షణమైనా విశాఖ నుంచే పాలన

Update: 2020-02-12 16:59 GMT
నవ్యాంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులంటూ జగన్ ప్రకటించడం - దానికి అనుగుణంగా జగన్ సర్కారు అడుగులు వేస్తున్న నేపథ్యంలో... అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏ క్షణమైనా తరలిపోయే అవకాశాలున్నాయన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ విశ్లేషణలు నిజమేనన్న రీతిలో ఇప్పుడు జగన్ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా విశాఖ నుంచే పాలన ప్రారంభం కావచ్చని పెద్దిరెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి వ్యాఖ్యలతో విశాఖ నుంచి పాలన నేడో, రేపో ప్రారంభమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అయినా ఈ దిశగా పెద్దిరెడ్డి ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘ రాబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పరిపాలన చేసే అధికారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉంది. దేనికైనా కొన్ని విధానాలు ఉంటాయి. అన్నీ పద్ధతి ప్రకారమే చేస్తాం. కోర్టుల నుంచి కూడా అన్నీ అనుమతులు వస్తాయి. ఈ విషయంలో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవు. రాజధాని విభజనకు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అడ్డుపడుతున్నారు. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరైనది. మూడు రాజధానుల నిర్ణయం వల్లే తమ ప్రభుత్వానికి ఇంత మంచి స్పందన వస్తోంది’’ అని పెద్దిరెడ్డి చాలా క్లారిటీతో కూడిన ప్రకటన చేశారు.

పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే... ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను తరలించే విషయంపై రాజధాని రైతులు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ హైకోర్టులో జరుగుతున్నా కూడా జగన్ సర్కారు... కేపిటల్ ను విశాఖకు తరలించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను గమనించిన తర్వాతే పెద్దిరెడ్డి ఈ మేర వ్యాఖ్యలు చేశారన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏ క్షణమైనా విశాఖకు తరలిపోతుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News