పొగ‌డ్త కావాలా?..బాబును చూసి నేర్చుకోండి!

Update: 2017-03-19 07:36 GMT
నిజ‌మేనండోయ్... టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు పాల‌న కాలంలో స‌రికొత్త సంస్కృతికి తెర లేసేసింది. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి దెబ్బ‌కు ఏకంగా ప‌దేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న చంద్ర‌బాబు... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ల‌భించిన విజ‌యం నేప‌థ్యంలో... ఆ ప‌దేళ్ల క‌రువును ఈ ఐదేళ్ల‌లోనే తీర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లున్నారు. ఈ క్ర‌మంలోనే పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి అయ్యే వ‌ర‌కు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డే ప‌ట్టిసీమ ప్రాజెక్టుకు ఏకంగా ఐదారు సార్లు ప్రారంభోత్స‌వాలు చేసేసి... నానా హంగామా చేసేసిన వైనంపై అటు విప‌క్షంతో పాటు ఇటు ప్ర‌జ‌లు కూడా నెత్తీ నోరు బాదుకున్న వైనం కూడా మ‌న‌కు తెలిసిందే. బాబు మ‌న‌సును అర్థం చేసుకున్నారో?.. ఏమో?  తెలియ‌దు గానీ... ఆయ‌న కేబినెట్‌ లోని మంత్రులు కూడా ఎక్క‌డ మాట్లాడినా... బాబు నామ‌స్మ‌ర‌ణ లేనిదే ముగించ‌డం లేదు. మాట్లాడేది నాలుగు వాక్యాలైతే... వాటిలో రెండు వాక్యాలు బాబును కీర్తిస్తూ చేసిన‌వే ఉంటున్న వైనం కూడా జ‌నానికి విసుగెత్తిస్తోంది. అస‌లు విష‌యం ప‌క్క‌న‌పెట్టేసి... ఈ బాబు నామ‌స్మ‌ర‌ణ ఏంటిరా బాబూ? అంటూ త‌ల‌లు బాదుకుంటున్న జ‌నం... త‌మ ఆగ్ర‌హాన్ని కూడా మంత్రుల ముఖం మీదే వెళ్ల‌గ‌క్కుతున్న సంద‌ర్భాలు కూడా లేక‌పోలేదు.

ఇక తాజా విష‌యానికి వ‌స్తే... ఏపీలో స‌రికొత్త సంప్ర‌దాయానికి బాబు అండ్ కో తెర తీసింది. ఏ పార్టీ ప్ర‌భుత్వ‌మున్నా... అటు కేంద్రంలోనే కాకుండా.. ఇటు రాష్ట్రాల్లోనూ ఏటా బ‌డ్జెట్ ప్ర‌తిపాదిస్తున్నారు. ఆ బ‌డ్జెట్ అమ‌లులో కిందా మీదా ప‌డుతున్నారు. అయితే ఎప్పుడు కూడా కేటాయింపులు చేయ‌గానే... అంతా అయిపోయిన‌ట్లు... ఆశించిన దానికంటే కూడా ఎక్కువ ల‌బ్ధి జ‌రిగిన‌ట్లు... ఆ ల‌బ్ధిని అందుకున్న వ‌ర్గాలు ప్ర‌భుత్వాధినేత‌కు పూలు - ప‌ళ్లు - శాలువాలు - కేక్ క‌ట్టింగుల‌తో స‌త్క‌రిస్తున్న వైనం ఎప్పుడూ మ‌న‌కు క‌నిపించ‌లేదు. అయితే ఇప్పుడు ఏపీలో ఈ త‌ర‌హా కొత్త సంస్కృతికి తెర లేసింది. మొన్న య‌న‌మల రామకృష్ణుడు బ‌డ్జెట్ ను అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌గా... ఆ మ‌రునాడే బాబు కేబినెట్‌ లోని మ‌హిళా మంత్రి పీత‌ల సుజాత‌... త‌న సొంత జిల్లాలో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఏకంగా కేకు తెప్పించి దానిని క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకున్న ఆమె... ఆ సంబ‌రాల‌కు చెప్పిన కార‌ణ‌మేంటో తెలుసా? య‌న‌మ‌ల బ‌డ్జెట్‌ లో అన్ని రంగాల‌కు కూడా స‌మ ప్రాధాన్యం ల‌భించినందుక‌ట‌. కేటాయింపుల‌కే ఈ మాత్రం హంగామా చేస్తే... ఇక కేటాయింపుల మేర‌కు ఖ‌ర్చు చేయ‌గ‌లిగితే... పీత‌ల వారు ఇంకెంత‌గా ఎగురుతారో చూడాలి.

అస‌లే నిధుల ల‌భ్య‌త లేని నేప‌థ్యంలో ఈ కేటాయింపుల మేర ఖర్చు దుస్సాధ్య‌మేన‌న్న వాద‌న నేప‌థ్యంలో కేటాయింపుల మేర ఖ‌ర్చు ఉండ‌బోద‌ని అర్థ‌మై కాబోలు... పీత‌ల ఇప్పుడే కేకు క‌ట్ చేసింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక నిన్న‌టి మ‌రో ఘ‌ట్టం చూస్తే నిజంగానే... ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు. కాపు కార్పొరేష‌న్‌ కు బ‌డ్జెట్లో చేసిన రూ. 1,000 కోట్ల‌ కేటాయింపుల‌కు ఉబ్బిత‌బ్బిబ్బు అయిపోయిన ఆ సామాజిక వ‌ర్గం నేత‌లు బాబు ముందు క్యూ క‌ట్టారు. కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ రామానుజ‌య నేతృత్వంలో పెద్ద సంఖ్య‌లో కాపు నేత‌లు బాబును ఘ‌నంగా స‌త్క‌రించారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీని ఇప్ప‌టికీ అమ‌లు చేయ‌డం లేద‌ని బాబుపై కాపు ఐక్య వేదిక నేత‌, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఉద్య‌మ బాట ప‌డితే... వీరేమో టీడీపీ తమ‌కు చెప్పిన దాని కంటే కూడా అధికంగానే చేసిందంటూ కొత్త వాద‌న‌ను తెర‌పైకి తెచ్చి... బాబును స‌త్క‌రించ‌డం చూస్తే... ఈ త‌ర‌హా పొగ‌డ్త‌ల గోల మ‌రెప్పుడూ చూడ‌మేమో అన్న భావ‌న క‌ల‌గక మాన‌దు. ఇదిలా ఉంటే... ఎక్క‌డిక‌క్క‌డ మంత్రులు, టీడీపీ నేత‌లు కూడా బ‌డ్జెట్ కేటాయింపుల‌ను ప్ర‌స్తావిస్తూ చంద్ర‌బాబును ఆకాశానికెత్తేస్తున్న వైనం కూడా ఈ మ‌ధ్య మ‌రింతగా ఎక్కువైపోయింద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మ‌రి ఈ త‌ర‌హా పొగ‌డ్త‌లు టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబును ఏ తీరాల‌కు చేరుస్తాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News