పెగాస‌స్‌ ను ప్రైవేటు వ్య‌క్తుల‌కు అమ్మ‌రు: జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

Update: 2022-03-23 08:39 GMT
ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు పెగాస‌స్ వ్య‌వహారం క‌ల‌క‌లం రేపుతోంది. తాను ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు ఈ పెగాస‌స్ను ర‌హ‌స్యంగా కొనుగోలు చేశారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై విచార‌ణ కోసం అసెంబ్లీ స‌భ సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది.

మ‌రోవైపు టీడీపీ కూడా అంతే దీటుగా ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చుతోంది. ఈ నేప‌థ్యంలో ప్రైవేటు వ్య‌క్తుల‌కు పెగాస‌స్ స్పైవేర్లు అమ్మే ప్ర‌స‌క్తే లేద‌ని ఎన్ఎస్‌వో కంపెనీ స్ప‌ష్టంగా చెప్పింద‌ని సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ తెలిపారు. ప్ర‌భుత్వం సంస్థ‌ల‌కు మాత్ర‌మే పెగాస‌స్‌ను అమ్ముతామ‌ని ఆ సంస్థ పేర్కొంద‌ని ఆయ‌న అన్నారు.

సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన క‌మిటీ కూడా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లేదా ప్రభుత్వ సంస్థ‌లు ఈ పెగాస‌స్‌ను కొనుగోలు చేశాయా అనే అంశంపై ఆరా తీస్తోంద‌ని జేడీ తెలిపారు. అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, కేంద్ర ప్ర‌భుత్వానికి, ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు లేఖ‌లు రాసి ఆ క‌మిటీ విచార‌ణ చేస్తున్న‌ట్లుంద‌ని, తిరిగి జ‌వాబు పొందిన క‌మిటీ ఇంకా పూర్తిస్థాయిలో నివేదిక అందించాల్సి ఉంద‌ని ఆయ‌న చెప్పారు. భ‌ద్ర‌త‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వాలు కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని కానీ దానికి సంబంధించిన స‌మాచారం కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు.

"కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఆ వివ‌రాలు తీసుకుంటాయి. పెగాస‌స్ కొన్నారా అని అడుగుతాయి. ప్రైవేటు వ్య‌క్తులు దాన్ని కొనుగోలు చేసే అవ‌కాశ‌మే లేదు. ప్రైవేటు సంస్థ‌ల‌కు ప్రైవేటు వ్య‌క్తుల‌కు దీన్ని అమ్మ‌కూడ‌దు.. కానీ ఒక‌వేళ వాళ్లు అలా చేసి ఉంటే కంపెనీ పైనా చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది. ప్ర‌భుత్వం ఏమైనా కొనుగోలు చేస్తే అది కచ్చితంగా రికార్డుల్లోకి వ‌స్తుంది. ఎవ‌రికి తెలీకుండా జ‌రిగే ప్ర‌స‌క్తే లేదు.

నేరుగా రాష్ట్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేయొచ్చు.. దానికి కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి అవ‌స‌రం లేదు. కానీ ఆ స‌మాచారం కేంద్రానికి తెలుస్తుంది. నేను మ‌హారాష్ట్రలో ప‌ని చేసిన‌ప్పుడు ఇలాంటి వాటి కొనుగోలు కోసం కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప‌న్ను మిన‌హాయింపు కోరాం.

అలాంటి స‌మ‌యాల్లో కేంద్రానికి తెలుస్తోంది. ప్ర‌భుత్వాల‌కు తెలీకుండా ద‌ర్యాప్తు సంస్థ‌లు ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసే అవ‌కాశ‌మే లేదు. ఒక ప్ర‌భుత్వం పెగాస‌స్ కొనుగోలు చేస్తే త‌ర్వాత వ‌చ్చే ప్ర‌భుత్వంలోనూ అది కంటిన్యూ అవుతుంది" అని ల‌క్ష్మీనారాయ‌ణ తెలిపారు.
Tags:    

Similar News