హైద‌రాబాదీల‌కు రేప‌టి నుంచి రోడ్ల‌పై చుక్క‌లే!

Update: 2017-07-31 09:27 GMT
హైద‌రాబాద్ రోడ్ల మీద డ్రైవింగ్ చేయ‌టం అల‌వాటైతే ప్ర‌పంచంలో ఎక్క‌డైనా డ్రైవ్ చేయొచ్చంటూ స‌ర‌దాగా చెబుతుంటారు. నిజ‌మే.. హైద‌రాబాద్‌లో డ్రైవింగ్ చేయ‌టం అంత ఈజీ కాదు. మ‌నం జాగ్ర‌త్త‌గా డ్రైవ్ చేసినా.. మ‌న ముందు వ్య‌క్తి కానీ.. ప‌క్క వ్య‌క్తి కానీ.. ఎదురుగా వ‌చ్చే వ్య‌క్తి కానీ స‌రిగా చేయ‌కుంటే మ‌న‌కే ప్ర‌మాదం. ఇరుకు రోడ్లు.. ట్రాఫిక్ రూల్స్ విష‌యంలో పెద్ద‌గా ప‌ట్టింపు లేక‌పోవ‌టం.. .ప‌రుగులు పెట్టించే న‌గ‌ర జీవితం.. అధికారుల నిర్లక్ష్యం.. సంవ‌త్స‌రం పొడుగూ రోడ్ల మీద ఏదో ఒక నిర్మాణ ప‌నులు జ‌రుగుతుండ‌టం లాంటి కార‌ణాల‌తో ఎవ‌రికి వారు రూల్స్‌ను ప‌ట్టించుకోకుండా త‌మ‌కెలా తోస్తే అలా డ్రైవ్ చేయ‌టం ఒక అల‌వాటుగా మారిపోయింది.

అయితే.. ఈ అల‌వాటును ఈ అర్థ‌రాత్రితో చెక్ చెప్పేయాల్సిందే. ఒక‌వేళ‌.. కాదు.. నాకున‌చ్చిన‌ట్లే డ్రైవ్ చేస్తాన‌ని మొండికేస్తే.. అడ్డంగా బుక్ కావ‌ట‌మే కాదు.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ కావ‌టం ఖాయ‌మంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మ‌రీ ముఖ్యంగా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఆగ‌స్టు ఒక‌టో తేదీ నుంచి రోడ్ల‌మీద డ్రైవ్ చేసే వారు ఒళ్లు పెట్టుకొని వాహ‌నాల్ని న‌డ‌పాలి. ఈ విష‌యంలో ఏ మాత్రం తేడా వ‌చ్చినా పాయింట్లు వారి ఖాతాలో వేసేలా అధికారులు రంగాన్ని సిద్ధం చేశారు.

పాయింట్లు ఏంటి? ఖాతా ఏంటి? అంటూ క్వ‌శ్చ‌న్ మార్క్ ఫేస్ పెడుతున్నారా? అయితే.. అస‌లు విష‌యం అర్థ‌మ‌య్యేలా చెబుతాం. ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసే వారికి చెక్ పెడుతూ స‌రికొత్త రూల్స్‌ను రేప‌టి నుంచి (ఆగ‌స్టు 1) హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో అమ‌లు చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి వాహ‌న‌దారుడికి వారి వ్య‌క్తిగ‌త డ్రైవింగ్ లైసెన్స్‌కు అనుసంధానంగా ఒక అకౌంట్‌ క్రియేట్ చేశారు.

రేప‌టి నుంచి వాహ‌నాన్ని న‌డిపే స‌మ‌యంలో నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తే.. వెంట‌నే వారికి పాయింట్ల వారీగా శిక్ష‌లు విధిస్తారు. ఈ పాయింట్లు రెండేళ్ల వ్య‌వ‌ధిలో అంటే 24 నెల‌ల వ్య‌వ‌ధిలో 12 పాయింట్లుకానీ న‌మోదు అయితే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను సిద్ధం చేశారు. ఇంత‌కూ ఏ త‌ప్పు చే్స్తే ఎన్ని పాయింట్లు న‌మోదు అవుతాయ‌న్న‌ది చూస్తే..

- ఆటోలో సామర్థ్యం కంటే అదనంగా ప్రయాణికుల్ని ఎక్కిస్తే: 1

- సీట్‌ బెల్ట్‌ పెట్టకుండా కారు నడిపితే, శిరస్త్రాణం లేకుండా ద్విచక్రవాహనం నడిపితే: 1

- గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణికుల్ని తరలిస్తే: 2

- రాంగ్‌ రూట్‌లో వాహనం నడిపితే: 2

- సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే: 2

-  సిగ్నల్ జంప్‌.. స్టాప్‌ లైన్‌ క్రాస్‌ చేస్తే.. ప్రమాదకరంగా డ్రైవింగ్‌ చేస్తే: 2

- నేష‌న‌ల్‌హైవేల మీద రూల్స్‌కు భిన్నంగా వెహికిల్ ఆపితే: 2

- ఇన్స్యూరెన్స్ పేప‌ర్లు లేకుండా డ్రైవ్ చేస్తే: 2

- ప్రమాదకర వస్తువుల్ని రవాణా చేసే వాహనాలకు పబ్లిక్‌ లయబిలిటీ సర్టిఫకేట్‌ లేకపోతే: 2

- ఐపీసీ 279/336/337/338 సెక్షన్లను ఉల్లంఘిస్తే: 2

- ఎక్క‌డైనా పేర్కొన్న వేగం కంటే ఎక్కువ వేగంతో వాహనం నడిపితే: 2

- రేసింగ్ కు : 3

- డ్రింక్ చేసి టూవీల‌ర్ డ్రైవింగ్‌కు: 3

- డ్రింక్ చేసి ఫోర్ వీల‌ర్ న‌డిపితే: 4

- డ్రింక్ చేసి బస్సు/క్యాబ్‌/ఆటో నడిపితే: 5

- వాహనం అజాగ్రత్తగా నడిపి ఎదుటి వ్యక్తి మ‌ర‌ణానికి కార‌ణ‌మైతే: 5

- వాహనంపై వెళ్తూ గొలుసుచోరీ/దోపిడీకి పాల్పడితే: 5
Tags:    

Similar News