రాహుల్‌ కు... 'మోదీ' స్వాగ‌తం ల‌భించిందే!

Update: 2017-11-09 10:59 GMT
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి నిజంగానే ఇప్పుడు టైం బాగోలేద‌న్న మాట వినిపిస్తోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల‌కు ముందు దేశానికి భావి ప్ర‌ధాని తానేన‌న్న భ్ర‌మ‌ల్లో ఉన్న రాహుల్ గాంధీకి 2014 ఎన్నికల్లో మొత్తం దేశ ప్ర‌జ‌లు పెద్ద షాకే ఇచ్చారు. అప్ప‌టిదాకా ప‌దేళ్ల పాటు అధికారం వెల‌గ‌బెట్టిన యూపీఏ స‌ర్కారుకు... మూడో ప‌ర్యాయం రాహుల్ గాంధీ నేతృత్వం వ‌హిస్తారంటూ కాంగ్రెస్ పార్టీ కాస్తంత ఘ‌నంగానే ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించింది. దేశంలో ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్ట‌డంతో పాటు ప్ర‌స్తుతం దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఈ త‌ర‌హాలో అభివృద్ధి చెందుతుండ‌టాన‌కి బీజం వేసిన మ‌న్మోహ‌న్ సింగ్ మూడో ప‌ర్యాయం ప్ర‌ధానిగా ఉండ‌ర‌ని, ఆయ‌న స్థానంలో రాహుల్ గాంధీ పీఠ‌మెక్కుతార‌ని హ‌స్తం పార్టీ బాకాలు ఊదేసింది. అదే స‌మ‌యంలో గుజ‌రాత్ సీఎం హోదాలో ఉన్న న‌రేంద్ర మోదీ... ఎన్డీఏ ప్ర‌ధాన‌మంత్రిత్వ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగేశారు. రాహుల్ గాంధీకి ధీటుగా ప్ర‌చార ఆర్భాటం చేసిన మోదీ... జ‌నాన్ని బాగానే ఆక‌ట్టుకున్నారు. ప‌దేళ్ల పాల‌న‌లో కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమిటీ?  తాము అధికారంలోకి వ‌స్తే చేసేదేమిటీ? అన్న రెండు అంశాల‌ను ప్ర‌ధానంగా ప్ర‌స్తావించిన మోదీ... అందుబాటులో ఉన్న సోష‌ల్ మీడియాను బాగా వాడేసి రాహుల్ గాంధీకి పెద్ద షాకే ఇచ్చారు. అప్ప‌టిదాకా ప‌దేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాకు అవ‌స‌ర‌మైన‌న్ని సీట్లు కూడా ద‌క్క‌కుండా చేసేశారు.

ఇదంతా గ‌త‌మ‌నుకుంటే... నాటి నుంచి నేటి వ‌రకు రాహుల్ కు వ‌రుస అవ‌మానాలే త‌ప్పించి... ఎక్క‌డ కూడా సానుకూల సంకేతాలు క‌నిపించ‌డం లేదు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ రాహుల్ నేతృత్వంలో బ‌రిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీకి ఘోర ప‌రాభ‌వాలే జ‌రిగాయి. ఇక ఇప్పుడు మోదీ సొంత రాష్ట్రం గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల వంతు వ‌చ్చేసింది. గుజ‌రాత్‌లో స‌త్తా చాటి మోదీ హ‌వాకు చెక్ పెట్టేద్దామ‌ని బ‌య‌లుదేరిన రాహుల్ గుజ‌రాత్‌ లో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌నకు ఘ‌న స్వాగ‌తాల‌కు బ‌దులుగా అవ‌మానాల పరంప‌ర స్వాగ‌తం ప‌లుకుతోంది. ఈ ప‌రంపర‌లో తాజాగా జ‌రిగిన అవ‌మానం ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... వ‌స్త్ర వ్యాపారానికి కేరాఫ్ అడ్రెస్‌ గా విల‌సిల్లుతున్న సూర‌త్‌ కు రాహుల్ గాంధీ వెళ్లారు.

ప్ర‌ధానంగా వ్యాపారులే మెజారిటీగా ఉన్న అక్క‌డ... మోదీ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన జీఎస్టీపై వ్య‌తిరేక‌త ఉంటుంద‌ని, ఈ కార‌ణంగా త‌న‌కు అక్క‌డ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌ని రాహుల్ భావించి ఉంటారు. అయితే అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన సూర‌త్ ప్ర‌జ‌లు రాహుల్ గాంధీకి పెద్ద షాకే ఇచ్చారు. రాహుల్ గాంధీ అక్క‌డి ఓ టెక్స్‌టైల్ మార్కెట్ కు రాగా... స్వాగ‌తం చెప్పేందుకంటూ అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మైన వ్యాపారులు... మోదీ - మోదీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ రాహుల్‌ కు వెల్‌ క‌మ్ చెప్పారు. ఊహించ‌ని ఈ ప‌రిణామంతో షాక్ తిన్న రాహుల్‌... త‌న‌ను అవ‌మానించిన వ్యాపారుల‌ను ఏమీ అన‌లేక, లోలోప‌లే కుత‌కుత‌లాడుతూ అక్క‌డి నుంచి వెళ్లిపోయార‌ట‌. ఈ త‌ర‌హా స్వాగ‌తాలు చూస్తుంటే... రాహుల్‌ కు మున్ముందు కూడా అవ‌మానాల ప‌రంప‌ర త‌ప్పేట్టుగా లేద‌న్న మాట వినిపిస్తోంది.

Full View
Tags:    

Similar News