పాపం ప్రజలు.. మోడీషాల ఉచ్చులో పడ్డారు?

Update: 2019-12-19 05:16 GMT
రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సు ఢిల్లీలో బుధవారం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటికి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కాస్త గట్టిగానే కేంద్రాన్ని నిలదీశారని తెలిసింది.దేశం ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడడానికి మోడీ సర్కారు ఆర్థిక విధానాలే కారణమని.. జీఎస్టీ సహా రాష్ట్రానికి నిధులు పంచకుండా కేంద్రం తన వద్దే దాచుకుంటోందని లెక్కలతో సహా కడిగేశారట..

నిజానికి ప్రధాని మోడీ తన పాలనలో చేసిన ఏకైక పెద్ద తప్పు నోట్ల రద్దు. మోడీ మొదటి ప్రభుత్వ హయాంలో చేసిన ఈ తప్పుడు నిర్ణయం పరిణామాలను దేశం ఇప్పుడు అనుభవిస్తోంది. ఆర్థిక మాంద్యంతో అట్టుడుకుతోంది. ఉద్యోగాలు పోయి నిరుద్యోగం పోయి... కంపెనీలు మూతపడి దేశంలో ఆటోమొబైల్ రంగం కుదేలై... జీడీపీ రేటు 4శాతానికి పడిపోయి దేశం అల్లకల్లోలంగా మారింది.

మోడీ చేసిన ఆర్థికపరమైన తొందరపాటు నిర్ణయాలే ఇప్పుడు ఫలితం అనుభవించేలా చేస్తోంది.. వీటిపై ఎక్కడ తిరుగుబాటు, అసంతృప్తి, ఉద్యమాలు చెలరేగుతాయోననే ఆందోళన, భయంతోనే మోడీషాలు వ్యూహాత్మకంగా వివాదాస్పద బిల్లులను తెరపైకి తెచ్చి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని విశ్లేషకులు ఆడిపోసుకుంటున్నారు.

ఆర్థిక మాంద్యం అనేది ఇప్పటికిప్పుడు పరిష్కరించే సమస్య కాదు. దేశం పీకల్లోతూ కష్టాల్లో ఉండగా అది కనపడకుండా మోడీషాలు ఇటీవలే పౌరసత్వ సవరణ చట్టాన్ని చేశారు. ఇప్పుడు దానిపై అందరూ కొట్టుకు చస్తున్నారు. మోడీషాల ప్లాన్ కూడా ఇదే. ఇలా కొన్నాళ్లు గడిపితే ఆర్థిక మందగమనంపై తమ వైఫల్యాలు కనిపించవని.. ఎవ్వరూ పట్టించుకోరని ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలకు ఆజ్యం పోస్తున్నట్టు ఢిల్లీలోని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Tags:    

Similar News