చంద్రబాబు ఊరిలో వైసీపీ ఎమ్మెల్యే చేసిన ప‌ని..

Update: 2021-04-28 05:30 GMT
ఇవాళా రేపు రాజ‌కీయాలు ఎలా ఉన్నాయంటే..? అయిన‌వాళ్ల‌కు ఆకుల్లో వ‌డ్డిస్తే.. కానివాళ్ల‌కు కంచం కూడా వేయ‌ట్లేదు! సంక్షేమ ప‌థ‌కాలు మొద‌లు అన్ని విష‌యాల్లోనూ ఇదే ప‌రిస్థితి. ఇక‌, ప్ర‌ధాన‌ ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న‌వారి గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ద‌గ్గ‌రికి కూడా రానివ్వ‌రు. అయితే.. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి మాత్రం చంద్ర‌బాబు గ్రామాన్ని అక్కున చేర్చుకున్నార‌ని స‌మాచారం.

చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌కవ‌ర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు చెవిరెడ్డి. చంద్ర‌బాబు స్వ‌గ్రామం నారావారిపల్లె ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంది. క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల యోగ‌క్షేమాల‌ను చూస్తున్నారు ఎమ్మెల్యే. ఇందులో భాగంగా.. చంద్ర‌బాబు స్వ‌గ్రామం నారావారి ప‌ల్లెను సైతం ఇత‌ర గ్రామాల మాదిరిగానే చూసుకున్నార‌ట చెవిరెడ్డి.

చంద్ర‌గిరి ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో 100 ప‌డ‌క‌లు, నారావారి ప‌ల్లె ఆసుప‌త్రిలో 50 ప‌డ‌క‌ల‌ను సొంత ఖ‌ర్చుల‌తో ఏర్పాటు చేయించిన‌ట్టు స‌మాచారం. ఇందుకోసం ఎమ్మెల్యే రూ.25 ల‌క్ష‌లు వెచ్చించిన‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా.. హోం క్వారంటైన్లో ఉన్న‌వారికి 34 ర‌కాల వ‌స్తువుల‌తో 2,500 కిట్ల‌ను ముందస్తుగా సిద్ధం చేశామ‌ని ఎమ్మెల్యే తెలిపిన‌ట్టు స‌మాచారం.

త‌న‌, ప‌ర బేధం చూప‌కుండా ఎమ్మెల్యే చెవిరెడ్డి అంద‌రినీ స‌మానంగా చూస్తున్నార‌ని స్థానికులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. ఇలాంటి ప‌రిస్థితుల్లో సొంత గ్రామానికి చంద్ర‌బాబు ఏమైనా చేశారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.
Tags:    

Similar News