ఉప ఎన్నిక‌లు కావాలంటున్న ప్ర‌జ‌లు

Update: 2021-07-23 07:30 GMT
ఒక‌ప్పుడు రాజ‌కీయ నాయ‌కులు ఎలా ఆడిస్తే ప్ర‌జ‌లు అలా ఆడేవాళ్లు.. వాళ్ల చేతిలో కీలుబొమ్మ‌లుగా మారేవాళ్లు. జ‌నాల‌ను మంచిక చేసుకునేందుకు నేత‌లు ఎన్నో వ్యూహాలు ర‌చిస్తారు. అధికారం కోసం ఎంత‌కైనా తెగిస్తారు. ఇన్నాళ్లూ రాజ‌కీయ నాయ‌కులు ఏం చేసినా చెల్లింది కానీ ఇప్పుడు ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెరిగింది. చ‌దువుకున్న యువ‌త ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తోంది.

దీంతో ఇప్పుడు నేత‌ల నాట‌కాలు న‌డిచే అవ‌కాశం లేకుండా పోతోంది. అందుకు తెలంగాణ‌లో తాజాగా జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలే నిద‌ర్శ‌నం. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌జ‌ల త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఉప ఎన్నిక‌లు రావాల‌ని కోరుకుంటున్నారు. అందుకు బ‌ల‌మైన కార‌ణం లేక‌పోలేదు.

అధికారంలో ఉన్న ఏ పార్టీ ప్ర‌భుత్వ‌మైనా ప్ర‌జ‌ల సంక్షేమం కోస‌మే ప‌నిచేయాలి. వాళ్ల ప్ర‌గ‌తికి అవ‌స‌ర‌మైన ప‌థ‌కాలు ఎప్ప‌టిక‌ప్పుడూ ప్ర‌వేశ‌పెట్టి జ‌నాల‌ను బాగు చేయాలి. కానీ ఎన్నిక‌లు వ‌చ్చిన‌పుడే ప‌థ‌కాలు పెడ‌తాం వ‌రాల జ‌ల్లు కురిపిస్తాం అంటే ఎలా ఉంటుంది. ఇదిగో ఇప్పుడు తెలంగాణ సీఏం కేసీఆర్ తీరు కూడా అలాగే ఉందంటూ ప్ర‌జ‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ను దృష్టిలో పెట్టుకుని ద‌ళిత బంధు ప‌థ‌కానికి కేసీఆర్ శ్రీకారం  చుట్టాల‌నే నిర్ణ‌యం తీసుకోవ‌డమే అందుకు కార‌ణం. అది కూడా హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోనే మొద‌ట ప్ర‌యోగాత్మ‌కంగా ఈ పథ‌కాన్ని అమ‌లు చేయ‌నున్నారు. అందుకు భారీ మొత్తంలో నిధులు కేటాయించ‌నున్నారు. ప్ర‌జ‌లు ఈ ప‌థ‌కం వెన‌కున్న మ‌ర్మాన్ని తెలుసుకోలేనంత పిచ్చోళ్లు కాదు క‌దా.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న కేసీఆర్ అక్క‌డ ఎలాగైనా మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకే ఈ ప‌థ‌కాన్ని తెర‌పైకి తెచ్చి హుజూరాబాద్‌లోనే మొద‌ట అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించార‌ని జ‌నాల‌కు అర్థ‌మైపోయింది.

ఇదే విష‌యాన్ని కేసీఆర్ కూడా ఒప్పుకోవ‌డం గ‌మ‌నార్హం. అవును.. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని తీసుకొచ్చాం. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఇలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో త‌ప్పేముందు అన్న‌ట్లూ ఆయ‌న వ్యాఖ్య‌లున్నాయి. దీంతో సీఎం కేసీఆర్‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని ఆయ‌న ఆధిప‌త్యానికి బీట‌లు వారుతున్నాయ‌ని గ్ర‌హించార‌ని ఈట‌ల విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

అవును.. నిజ‌మే ఈ ఉప ఎన్నికలో విజ‌యం కోసం కేసీఆర్ ఏమైనా చేస్తార‌ని, గెల‌వ‌డ‌మే ఆయ‌న టార్గెట్ అని ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు. ప‌థ‌కం పేరు చెప్పి డ‌బ్బులు పంచి గెల‌వాల‌ని అనుకుంటున్నాడ‌ని కేసీఆర్‌పై మండిప‌డుతున్నారు. ద‌ళిత వ్య‌క్తిని తెలంగాణ సీఏం చేస్తాన‌నే హామీని తుంగ‌లో తొక్కి అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్‌.. కార‌ణం లేకుండానే ఓ ద‌ళిత డిప్యూటీ సీఎంనీ అవ‌మానించి కేబినేట్ నుంచి బ‌య‌ట‌కు పంపిన‌పుడు ద‌ళిత బంధు గుర్త‌కు రాలేదా అని ప్ర‌శ్నిస్తున్నారు.

 ఇదే స‌మ‌యంలో త‌మ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఉప ఎన్నిక‌లు వ‌స్తే బాగుండ‌ని జ‌నం కోరుకుంటున్నారు. ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో ఇదే వైరల్‌గా మారింది. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఉప ఎన్నిక‌లు రావాల‌ని కోరుకుంటున్న‌ట్లు ప్ర‌జ‌లు పోస్టులు పెడుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే. . ఎన్నిక‌లు వ‌స్తేనే క‌దా కేసీఆర్ వ‌రాల వ‌ర్షం కురిపించేది కొత్త ప‌థ‌కాల‌తో త‌మ‌కు మేలు చేసేది అని జ‌నాలు స‌మాధానిమిస్తున్నారు. ప‌రిశీలించి చూస్తే అదే నిజమ‌ని ఒప్పుకోక త‌ప్ప‌దు.

దుబ్బాక, సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల‌పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గాల‌కు వ‌రాల జ‌ల్లు కురిపించిన ఆయ‌న‌.. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌ద సాయం పేరుతో ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచారు క‌దా అని విశ్లేష‌కులు అంటున్నారు. దీంతో త‌మ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇప్పుడు ఉప ఎన్నిక‌లు వ‌స్తేనే కేసీఆర్ త‌మ వైపు చూస్తార‌నే ఆశ‌తో ప్ర‌జ‌లున్నారు. అందుకే త‌మ ఎమ్మెల్యేనో ఎంపీనో త‌మ ప‌ద‌వికి రాజీనామా చేస్తే బాగుండేద‌ని జ‌నాలు అనుకుంటుండ‌టం విశేషం.
Tags:    

Similar News