కావాల‌నుకున్న‌వారే.. కాద‌నుకుంటున్నారే.. ఏంటీ ప‌రిస్థితి!

Update: 2023-02-20 10:58 GMT
కావాలి.. రావాలి.. అనుకున్న‌వారే.. ఇప్పుడు కాదంటున్నారు.. ఏం చేయాలి? ఇదీ.. వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్‌ను వేధిస్తున్న ప్ర‌శ్న‌. ప్ర‌జ‌ల‌ను ఆయ‌న న‌మ్ముకున్నాన‌ని చెబుతున్నా.. అంత‌ర్గ‌తంగా మాత్రం పార్టీ నేత‌ల‌పై మ‌థ‌న ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌లు అంత‌కుముందు జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ.. త‌న‌ను బ‌లంగా కోరుకున్న క్యాడ‌ర్ ఉంది. కానీ, ఇప్పుడు బెడిసికొడుతోంది. ఎవ‌రిని క‌దిపినా.. స‌గంస‌గం అభిమాన‌మే క‌నిపిస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైనాట్ వ్యూహం అమలుతో విజృంభించాల‌ని అనుకున్నా.. క్షేత్ర‌స్థాయిలో 50 నుంచి 70 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఏమాత్రం బాగోలేదు. నెల్లూరులో రెడ్డి సామాజిక వ‌ర్గం పూర్తి యాంటీగా ఉంది.

గ‌తంలో ఇదే రెడ్డి వ‌ర్గం జ‌గ‌న్ కోసంఆస్తులు అమ్ముకుని ఖ‌ర్చు చేసిన ప‌రిస్థితి నుంచి ఇప్పుడు బ‌య‌ట‌కు కూడా రాలేని ప‌రిస్థితి.. ఆయ‌న‌ను బాహాటంగా స‌మ‌ర్థించే ప‌రిస్థితి లేకుండా పోయింది. గ‌త ఎన్నిక‌ల్లో అనేక మంది రెడ్డి నేత‌లు.. పారిశ్రామిక వేత్త‌లు.. జ‌గ‌న్ సీఎం కావ‌డం కోసం కృషి చేశారు.

కానీ, ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వారు రాలేక పోతున్నారు. ఏం చేసినా.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించే ప‌రిస్థితి లేద‌ని వారు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఇక‌, సొంత పార్టీ నాయ‌కుల్లోనూ తీవ్ర అసంతృప్తి ఏర్ప‌డింది. తొలిసారి ఎన్నికైన నాయ‌కులు.. 50 మంది ఉంటే.. 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో వారిపై వ్య‌తిరేక‌త పెరిగిపోయింది. దీంతో అలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు సాధ్యం కాద‌నేది తాజాగా తేల్చిన నిజం. ఇక‌, సీనియ‌ర్ మంత్రులు, నాయ‌కులు. త‌మ‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌నే ఆవేద‌న‌లో ఉన్నారు.

మ‌రోవైపు.. అధికారులు సైతం త‌మ‌కు ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని.. సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ యం.. త‌మ‌ను కోర్టు బోను ఎక్కిస్తోంద‌ని వాద‌న వినిపిస్తున్నారు.ఐఏఎస్‌, ఐపీఎస్ వ‌ర్గాల్లో ఈ త‌ర‌హా ప‌రిస్థి తి క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల జ‌రిగిన అన‌ప‌ర్తి ఘ‌ట‌న‌పై ఒక ఐపీఎస్ అధికారి ఆఫ్ దిరికార్డుగా ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. మేం చేయ‌గ‌లిగింది ఏమీ లేదు! అని ఆయ‌న న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. అంటే.. ఇంటా బ‌య‌టా కూడా.. జ‌గ‌న్‌కు సెగ పెరిగిపోయింది. ఒక‌ప్పుడు కావాల‌ని.. రావాల‌ని అనుకున్న వారే ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. మ‌రి ఏం చేస్తారోచూడాలి.       



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News