బాబోయ్‌...ఇన్ని ఛాన‌ళ్లు రానున్నాయా?

Update: 2015-12-14 06:20 GMT
స‌మాచార సాంకేతిక రంగం కొత్త పుంత‌లు తొక్క‌డంతో సంప్ర‌దాయ‌ స‌మాచార-ప్ర‌సార మాధ్య‌మాల కంటే సోష‌ల్ మీడియా దుమ్మురేపుతోంది. ఫోర్త్ ఎస్టేట్ కంటే  ఫిప్త్ ఎస్టేట్ పేరుతో పిల‌వ‌బ‌డే ఈ మీడియం ఎంత తెర‌మీద‌కు వ‌చ్చినా...ఆన్‌ లైన్ మీడియా అందుబాటులో ఉన్నా టెలివిజ‌న్ ఛాన‌ళ్ల‌కు డిమాండ్ త‌గ్గ‌డం లేద‌ని క‌నిపిస్తోంది. తాజాగా కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖ విడుద‌ల చేసిన గ‌ణాంకాల మేర‌కు మ‌రిన్ని ఛాన‌ళ్లు త్వ‌ర‌లో మ‌న ముందుకు రానున్నాయి.

దేశంలో అధికారిక లెక్క‌ల ప్ర‌కార‌మే టెలివిజన్‌ ఛానళ్ల సంఖ్య ఇప్పటికే 800 దాటింది. సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ ఈ ఏడాది మ‌రో 40 ఛానళ్లకు అనుమతినిచ్చింది. అయితే డిమాండ్ ఇంకా భారీగానే ఉంద‌ని తెలుస్తోంది. న్యూసేతర - కరెంట్‌ ఎఫైర్స్‌ ఛానల్స్‌ బాగా పెరుగుతున్నాయని గ‌ణాంకాలు వివ‌రిస్తున్నాయి. ఇవి పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చి న్యూస్‌ ఛానల్స్‌ సంఖ్యను మించిపోతున్నాయని కేంద్ర‌ప్ర‌భుత్వం సార‌థ్యంలో న‌డిచే స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ‌ శాఖ తెలిపింది. 2014-2015లో ఈ ధోరణి భారీ స్థాయిలో పెరిగిందని సంబంధిత శాఖా వ‌ర్గాలు వివ‌రిస్తున్నాయి.

సమాచార మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం గత కొన్నేళ్లల్లో ప్రైవేటు శాటిలైట్‌ ఛానల్స్‌ 955కి అనుమతులు ఇచ్చారు. 125 ఛానల్స్‌ కు వివిధ కారణాల రీత్యా అనుమతులు రద్దు చేశారు. ఛానల్‌ నిర్వహించకపోవడం, బ్యాంకు హామీని సమర్పించకపోవడం వంటి కారణాల రీత్యా వీటిని రద్దు చేశామని వివరించారు. దేశంలో 830 ప్రైవేటు టీవీ ఛానల్స్‌ కు సరైన అనుమతులు ఉన్నాయని చెప్పారు. ఇందులో 398 న్యూస్‌ - కరెంట్‌ ఎఫైర్స్‌ ఛానల్స్‌ కాగా 432 న్యూసేతర - కరెంట్‌ ఎఫైర్స్‌ ఛానల్స్‌ అని వివరించారు. మరో 260 ఛానళ్లు లైసెన్స్‌ కోసం  ఎదురుచూస్తున్నాయని... ప్రసార శాఖ వద్ద ఈ అప్లికేషన్‌ లు పెండింగ్‌ లో ఉన్నాయని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఇన్నిఛాన‌ళ్లు మార్కెట్‌ ను ముంచెత్తే అవ‌కాశం అతి త్వ‌ర‌లోనే ఉంద‌న్న‌మాట‌!!
Tags:    

Similar News