అన్ని అనుమతులూ ఇలాగే ఇవ్వండి సారూ..

Update: 2015-10-15 04:52 GMT
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి అనుమతులు ఇచ్చే ప్రక్రియను పూర్తి చేశామని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ బుధవారం ఈ విషయమై ప్రకటన విడుదల చేసారు. ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోదీ, ఇతర సీనియర్ బీజేపీ మంత్రులను కలవడానికి దేశరాజధానికి చేరుకున్న నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ రాజధాని నిర్మాణ అనుమతుల ప్రక్రియను పూర్తి చేశామని చెప్పడం గమనార్హం.

అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం ఇంతవరకు తనను సంప్రదించలేదని జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రకటించి అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్న భూ చదును కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలని ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయిందని కేంద్రమంత్రి ప్రకటించడం తీవ్ర అనుమానాలకు దారి తీసింది.

సరిగ్గా నిన్నటికి నిన్న సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ సైతం పర్యావరణ అనుమతులు తీసుకోలేదని ఆరోపిస్తూ అమరావతి నిర్మాణ ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలియజేయడం తెలిసిందే. అయితే కేంద్ర మంత్రి ప్రకటించిన మేరకు పర్యావరణ అనుమతులు ఒక్కరోజులోపే లభించి ఉంటే రాజధాని అభివృద్ధి పనులకు ఇక ఎలాంటి ఆటంకాలూ ఉండవని అనుకోవచ్చు.

కానీ తేలవలసిన అసలు విషయం ఏమిటంటే 24 గంటల్లోపు ఒక ప్రాంత అభివృద్ధికి సంబంధించి పర్యావరణ అనుమతులను మంజూరు చేయడం ఏ ప్రభుత్వానికైనా సాధ్యమేనా? ప్రాధమిక పరిశీలన, దాని క్లియరెన్స్ ఇంత సత్వరంగా జరుగుతాయా? అని ప్రజలు అడుగుతున్నారు. అమరావతి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కనుక.. దానికి అనుమతులు ఇవ్వడం గురించి ఎవ్వరూ అభ్యంతరపెట్టడం లేదు. కానీ ప్రతి ప్రాజెక్టును కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతే ప్రతిష్టగా చేస్తుంటాయి. వాటన్నింటికీ కూడా.. ఇంతే వేగంగా స్పందించండి సారూ అని అడుగుతున్నారు.  ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులు కూడా ఇంతింత స్పీడుగా అనుమతించబడితే దేశం ఈపాటికే ఎంతో ముందుకెళ్లి ఉండేది కదా అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది.
Tags:    

Similar News