రాజకీయాలన్నాక తమ ప్రత్యర్థులపై విరుచుకుపడటం చాలామంది రాజకీయ నేతలు చేసే పనే. కానీ.. తాను చేసే వ్యాఖ్యల కారణంగా తనకు కానీ.. తన పార్టీకి కానీ దారుణమైన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంటే.. ఆ తీరును తక్షణం మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఆ విషయాన్ని ఏపీ మంత్రి పేర్ని నాని మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే రియాక్టు అయిన మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
పవన్ మాట్లాడే ప్రతి మాటను తప్పు పట్టటమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన.. ప్రతి మాటలోనూ ఏదో ఒక అర్థాన్ని బయటకు తీయటం ద్వారా తప్పుల మీద తప్పులు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాను ఒక మంత్రిని అన్న విషయాన్ని మర్చిపోయిన పేర్ని నాని.. కులాల గురించి అడ్డదిడ్డంగా మాట్లాడటానికి కూడా వెనుకాడలేదు.
ఆయన మాటలే జగన్ సర్కారుకు శాపంగా మారతాయన్న అభిప్రాయం వ్యక్తమయ్యేలా చేస్తున్నారు. వైసీపీకి కమ్మ వారిని దూరం చేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న మాటలు చూస్తే.. పవన్ ను తిట్టేందుకు ఎంత మాట అయినా మాట్లాడే వాచలత్వం పేర్ని నానికి పెరిగిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
పేర్ని నాని మాటల్ని చూస్తే.. కమ్మవారిని గతంలో ఎప్పుడూ లేనంతగా అన్ని వర్గాల వారు మరోలా చూసేలా చేయటంలో వైసీపీ సక్సెస్ అయ్యిందన్న విషయం అందరికి తెలిసిందే. అందుకు భిన్నంగా పేర్ని నాని మాటలు ఉండటం విశేషం.
బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే వైసీపీని అధికారం నుంచి దించే ప్రయత్నం చేస్తానని పవన్ అంటున్నారని.. అంతా కలిసి చంద్రబాబును సీఎంను చేస్తారా? అని ప్రశ్నించారు. మిత్ర ధర్మాన్ని పాటిస్తూ.. బీజేపీకి మిత్రుడిగా ఉన్న పవన్.. ఆ మాటను అనటం తప్పేం కాదు. పొత్తులో భాగంగా కలిసి ఉన్నప్పుడు.. తన మిత్రుడి రోడ్ మ్యాప్ నకు తగ్గట్లుగా నడుస్తామని చెప్పటంలో అంత అభ్యంతరకర విషయం ఏముందో పేర్ని నానికే తెలియాలి.
ఇలా తనకు తోచినట్లుగా మాట్లాడిన మాటలు అధికార పార్టీకి దెబ్బగా మారతాయన్న మాట వినిపిస్తోంది. పవన్ ను టార్గెట్ చేసే క్రమంలో.. తీవ్రమైన ఆవేశానికి గురవుతున్న ఆయన.. సొంత పార్టీకి చేటు కలిగించేలా ఆయన మాటలు ఉంటున్నాయని చెబుతున్నారు. అందుకు తగ్గట్లే ఆయన తాజా మాటలు ఉన్నాయని.. కావాలంటే వినాలంటున్నారు. పవన్ ను టార్గెట్ చేసిన పేర్ని నాని చేసిన వ్యాఖ్యల్లో డ్యామేజింగ్ గా మారిన వ్యాఖ్యల్ని చూస్తే..
- దుర్గమ్మ సాక్షిగా అమరావతిని కుల రాజధాని అని పవన్ చెప్పలేదా? భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు.. జనసేన ఆవిర్భావ సభకు ఏమాత్రం తేడా లేదు. భీమ్లానాయక్ డైలాగ్‌లనే సభలో చెప్పారు.
- ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కమ్మ వారికి దూరం చేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు.
- వన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో మా అందరికీ ఒక గెస్ట్, టూరిస్టుగా తప్ప ఇంకేంటి?
- జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలిస్తే.. నేను సినిమాలు చేసుకుంటానని చెప్పావు.. అలాగే సినిమాలు చేసుకుంటున్నావు కదా?
- జనసేన కార్యర్తలకు ఎంత దౌర్భాగ్యం వచ్చిందంటే.. ఒక్కొక్క ఎలక్షన్‌కి ఒక్కో పార్టీకి ఓటెయ్యమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్తారు. కమలం, సైకిల్, కంకి కొడవలి, కంకి సుత్తి, ఏనుగు, గాజు గ్లాసు.. ఇలా ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీకి ఓటెయ్యాలని చెబుతారు.
- టీడీపీ, బీజేపీని కలిపేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. అందుకే చంద్రబాబుతో మింగిల్ అయ్యామన్న విషయం చెప్పొచ్చు కదా?